
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. వ్యాక్సిన్ వస్తే గానీ కట్టడి పడేటట్లు లేదు. దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య పెరగడంతో వినోదానికి చెందిన ప్రదేశాలపై ఆంక్షలు విధించడానికి ఆ దేశ ప్రభుత్వం సిద్దమైంది. నైట్ క్లబ్‌లు, కచేరీలు జరిగే బార్‌లను, ఇంటర్నెట్ కేఫ్‌లను మరోసారి మూసివేయాలని నిర్ణయించింది. అంతేకాదు, క్రీడలు జరిగే ప్రదేశాల్లో ప్రేక్షకులు పాల్గొనకుండా ఆంక్షలు విధించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న బీచ్‌లను కూడా కొద్ది రోజుల పాటు మూసివేయాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. ఇక, ఈ ఆంక్షల్లో భాగంగా ఇండోర్ మీటింగుల్లో 50 మంది.. ఔట్ డోర్ మీటింగుల్లో 100 మందికి మించకుండా జన సమీకరణ ఉండేలా నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఆంక్షలన్నీ ఆదివారం నుంచే అమలులోకి వస్తాయని దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ మంత్రి పార్క్ న్యూంగ్-హూ వెల్లడించారు. శుక్రవారం, శనివారం రోజుల్లో దక్షిణ కొరియాలో భారీగా కేసులు బయటపడ్డాయి. సియోల్ మెట్రో పాలిటన్ ప్రాంతం నుంచే అత్యధిక కేసులు వెలుగుచూసినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా.. తక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఈ ఆంక్షలను తప్పనిసరిగా కాకుండా నిబంధనలను అమలు చేయనున్నట్లు పార్క్ న్యూంగ్-హూ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం అదుపు చేయని విధంగా కరోనాను దక్షిణ కొరియా అదుపు చేయగలిగింది. అయితే, కొద్ది రోజుల నుంచి దేశంలో మరోమారు మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రభుత్వం మరోసారి నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. కాగా.. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 17,002 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 309 మంది మృత్యువాతపడ్డారు