దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 11,945 వద్ద, సెన్సెక్స్ 329 పాయింట్లు పెరిగి 39,831 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. మార్కెట్‌ను ముఖ్యంగా బ్లూచిప్ కంపెనీల షేర్లు నడిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా కన్సల్టెన్సీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల షేర్లు లాభపడంతో సూచీలు కూడా పరుగులు తీశాయి. దీంతో సూచీలు నిఫ్టీలో కీలకమైన 11,950 మార్కును దాటాయి. టెలికమ్, ఎనర్జీ, ఐటీ, నిత్యావసరాలు, విద్యుత్తు, ఫైనాన్స్ రంగాలు బాగా లాభపడ్డాయి. నిఫ్టీలో అత్యధికంగా ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. దాదాపు 3.2శాతం పెరిగి రూ.135కు చేరాయి. ఆ తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, యస్‌బ్యాంక్, భారత్ పెట్రోలియం, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, యూపీఎల్‌లు ఉన్నాయి. సన్‌ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి.