మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం డిపాజిట్ చేసిన డబ్బు తిరిగి ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం కోర్టు రిజిస్ట్రీ వద్ద కార్తీ ఇంతకు ముందు రూ.10 కోట్లు డిపాజిట్ చేశారు. అయితే తాజాగా ఈ సొమ్ము తిరిగి ఇప్పించాలంటూ ఆయన సుప్రీంను కోరారు. అది వడ్డీకి తీసుకొచ్చిన డబ్బు అనీ.. ప్రతినెలా వడ్డీ కట్టాల్సి వస్తోందంటూ కోర్టుకు తెలిపారు. అయితే ఆయన వాదనతో ఏకీభవించని సుప్రీం.. మీ నియోజకవర్గం మీద దృష్టి పెట్టండంటూ.. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. అక్రమ లావాదేవీల ఆరోపణలపై కార్తీ చిదంబరం సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.