కట్టుబాటు నుంచి అధునిక ప్రపంచం వైపు అరబ్ దేశాలు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియా సర్కార్ మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో మహిళల కోసం దేశవ్యాప్తంగా మరిన్ని డ్రైవింగ్ స్కూల్స్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అలాగే, మగవారి డ్రైవింగ్ స్కూల్స్‌లల్లో ఇకపై మహిళలకు కూడా అవకాశం కల్పించనున్నట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, మహిళా ట్రైనర్స్ పర్యవేక్షణలో వీరికి డ్రైవింగ్ శిక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక, 2017లో మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశం కల్పించిన సౌదీ… 2018, జూన్ 24 నుంచి వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడం ప్రారంభించింది.
జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం సౌదీ ప్రభుత్వం 2020, జనవరి నాటికీ 1,74,624 మంది మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసినట్లు వెల్లడైంది. వీటిలో రియాద్ లో అత్యధికంగా 47.7 శాతం మందికి లైసెన్స్ జారీతో మొదటి స్థానంలో ఉంటే… తూర్పు ప్రావిన్స్- 27.9 శాతం, మక్కా- 14.4 శాతంతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా ఐదు మహిళా డ్రైవింగ్ స్కూల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా, తబుక్‌లో ఈ డ్రైవింగ్ స్కూల్స్ నడుస్తున్నాయి. తాజాగా సౌదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో మరిన్ని డ్రైవింగ్ స్కూల్స్ విస్తరించే అవకాశముంది. దీంతో మరింత మంది మహిళలకు డ్రైవింగ్ నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. సౌదీ అరేబియా సర్కార్ నిర్ణయం పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.