ఆర్టీసీ సమ్మె ఈ రోజుతో 18వ రోజుకు చేరింది. ఇన్ని రోజులవుతున్నా.. ఇటు ఆర్టీసీ కార్మికులు కానీ.. అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇద్దరి మధ్య సంధి కుదరడం లేదు. సమ్మె బాట పట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రోజుకో తరహాలో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. సమ్మె బాట పట్టిన కార్మికులు 18వ రోజు.. తమ నిరసన తెలుపుతున్నారు. ఇవాళ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పూలిచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. తమ డిమాండ్ల కోసం చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. తమ స్థానంలో విధులు నిర్వహిస్తూ.. తమ పొట్ట కొట్టవద్దని వేడుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే డిపోల ఎదుట కార్మికులు నిరసన తెలుపుతున్నారు. సికింద్రాబాద్, జేబీఎస్ దగ్గర ఇవాళ పెద్ద ఎత్తున వంటా వార్పు చేపట్టారు కార్మికులు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు. అంతేకాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా.. ఏ జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికులు.. ఆ బస్ డిపోలో సమ్మెలు చేస్తున్నారు.