అతివేగం అనర్థాలకు దారి తీస్తోంది. పోలీసులు ఎంత మొత్తుకున్నా రోడ్డు పక్కన సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా యువత వినడం లేదు. వయసు ప్రభావమో ఏమో తెలియదు కానీ వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకొని కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. తాజాగా గచ్చి గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇవాళ తెల్లవారుజామున గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఓ కారును వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీస్తున్నారు. మృత దేహాలను స్వాధీనం చెసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు, కారు సిగ్నల్ జంప్ చేయడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు క్షణాల్లో మృతి చెందడంతో నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.