
ప్రపంచం ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తోంది. రోజు రోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రజలకు కావాల్సిన పరికరాలు, వస్తువులు మరింత స్మార్ట్ గా తయారవుతున్నాయి. ఒకప్పుడు ఏమైనా రాయలంటే పేపరు, పెన్ను లేకపోతే పలక, బలపం అవసరమయ్యేవి. ఇప్పుడు వాటి అవసరమే లేదు. చేతిలో ఇమిడిపోయే చిన్న పరికరాలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ల్యాప్ టాప్ లకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ట్యాబ్లెట్ లను ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు తమ అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు రకరకాల మోడళ్లలో వీటిని తయారు చేస్తున్నాయి. ఎప్పటి కప్పుడు కొత్త రకాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. వీటిలోని పేపర్ టాబ్లెట్ల లో నోట్స్ రాసుకోవచ్చు. డ్రాయింగ్ వేసుకోవచ్చు. పీడీఎఫ్ రూపంలో అంటే అనేక పుస్తకాలను కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా అరచేతిలోనే ప్రపంచం ఉందనే భావన కలిగిస్తాయి. ఇటీవల దేశంలోకి రిమార్కబుల్ 2 అనే పేపర్ టాబ్లెట్ విడుదలైంది. దాని ప్రత్యేకతలను తెలుసుకుందాం.
ప్రముఖ నార్వేజియన్ ట్యాబ్లెట్ బ్రాండ్ కంపెనీ అయిన రిమార్కబుల్ తన ప్రత్యేక రిమార్కబుల్ 2 పేపర్ టాబ్లెట్ ను మన దేశంలో విడుదల చేసింది. దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. నోట్ టేకింగ్, రీడింగ్, డాక్యుమెంట్లను సమీక్ష చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాగితంపై రాసినప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, ఈ టాబ్లెట్ ను ఉపయోగించినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అలాగే ఒక పేజీలో చేతితో రాసిన, లేదా టైపింగ్ చేసిన వివిధ వాక్యాలను, పదాలను ఒకదానికి మరొకటి కలపడానికి ఉపయోగపడుతుంది. ఆ వాక్యాల క్రమాన్ని మనం అవసరం మేరకు ముందుకు, వెనుకకు మార్చుకునే వీలు కూడా ఉంది. పీడీఎప్ పత్రాలు, ఇ-పుస్తకాలపై నేరుగా సమీక్ష కూడా రాయవచ్చు. ఈ పేపర్ టాబ్లెట్ కు సాఫ్ట్ వేర్ ఎకోసిస్టమ్ సపోర్టు చేస్తుంది. దానిని క్లౌడ్ బేసిడ్ మొబైల్స్ అలాగే డెస్క్ టాప్ యాప్ లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
రిమార్కబుల్ 2 ట్యాబ్లెట్ ను మన దేశంలోకి విడుదల చేయడంపై ఆ కంపెనీ సీఈవో ఫిల్ హెస్
ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇది తమకు చాలా సంతోషకర విషయమన్నారు. భారత్ లో గొప్ప సంప్రదాయాలు, విలువలు ఉన్నాయని, సాంకేతిక అవగాహన కలిగిన ప్రజలు, పెరుగుతున్న డిజిటల్ ఎకానమీ కారణంగా తమ ట్యాబ్లెట్ ను మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని ప్రజలు మరింత మెరుగ్గా ఆలోచించడానికి తమ రిమార్కబుల్ 2 ట్యాబ్లెట్ ఉపయోగపడుతుందన్నారు.
రిమార్కబుల్ 2 పేపర్ ట్యాబ్లెట్ ఇప్పుడు మన దేశంలో అందుబాటులో ఉంది. ప్రముఖ ఇ-కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్‌లో రూ. 43,999కి ఇది లభిస్తుంది. కంపెనీ ప్రత్యేక ఆఫర్ గా ట్యాబ్లెట్ తో ఒక బండిల్ ప్యాక్‌ను అందిస్తోంది, అందులో మార్కర్ ప్లస్ అనే ఎరేజర్‌తో కూడిన రైటింగ్ పెన్, బుక్ ఫోలియో కలిసి ఉంటాయి. వాటితో కలిసి మొత్తంగా రూ. 53,799 ధర నిర్ణయించింది. అయితే మార్కర్ ప్లస్, బుక్ ఫోలియో రెండూ విడివిడిగా కొనాలంటే రూ. 13,599, రూ. 19,499కు ఖర్చవుతుంది. రిమార్కబుల్ మొబైల్, డెస్క్ టాప్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ. 299 లేదా సంవత్సరానికి రూ. 2,990కి చెల్లించాలి. అయితే కంపెనీ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రిమార్కబుల్ 2 బండిల్ కొనుగోలుతో అప్లికేషన్ కోసం ఒక సంవత్సరం ట్రయల్ అందిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..