ఉజ్జయిని మహాకలేశ్వర్ వద్ద పురావస్తు తవ్వకాలు.. శిథిలాల్లో బయటపడ్డ వెయ్యేళ్లనాటి మందిరం..

భారతీయ సంస్కృతి ప్రతిరూపం మరో కళాఖండం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకలేశ్వర్ మందిర విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా వెయ్యేళ్ల క్రితం నాటి పురాతన ఆలయం బయల్పడింది.

ఉజ్జయిని మహాకలేశ్వర్ వద్ద  పురావస్తు తవ్వకాలు.. శిథిలాల్లో బయటపడ్డ వెయ్యేళ్లనాటి మందిరం..

భారతీయ సంస్కృతి ప్రతిరూపం మరో కళాఖండం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకలేశ్వర్ మందిర విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా వెయ్యేళ్ల క్రితం నాటి పురాతన ఆలయం బయల్పడింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే పురాతత్వ విభాగానికి చెందిన అధికారులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ నిర్మాణాలకు సంబంధించి ఆనవాళ్లను తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

మహాకాలేశ్వర్ ప్రధాన ద్వారం వద్ద సతీ ఆలయం సమీపంలో వెయిటింగ్ ఏరియా, గార్డెన్, ఇతర సదుపాయాలను అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తవ్వినప్పుడు 20 అడుగుల లోతులో ఒక మెట్ల మార్గాన్ని నిర్మాణ కార్మికులు గుర్తించినట్లు మందిరం అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ మూల్‌చంద్ జున్వాల్ తెలిపారు. త్రవ్వడం ఆపేసి పురాతన నిర్మాణాల గురించి పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ రామన్ సోలంకికి సమాచారం ఇచ్చామని ఆయన వెల్లడించారు. అతని నివేదిక సమర్పించిన తర్వాత త్రవ్వడం తిరిగి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా రమణ్ సోలంకీ మాట్లాడుతూ మహాకాళ్ మందిర విస్తరణ కోసం స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో తవ్వకాల పనులు జరుగుతున్నాయన్నారు. ఈ తవ్వకాల్లో పురాతన ఆలయం, కొన్ని పురాతన కళాకృతులు బయల్పడ్డాయన్నారు. ఈ ప్రాంతంలో ఈవిధంగా పురాతన ఆనవాళ్లు లభ్యంకావడం ఇది తొలిసారని అన్నారు. పూర్తిగా తవ్వకాలు జరిపిన తరువాత ఆలయ నిర్మాణ తీరుతెన్నులు తెలుస్తాయన్నారు.

తవ్వకం సమయంలో దొరికిన ఎరుపు గోధుమ రంగు బసాల్ట్ ఆ కాలంలో ఉపయోగించినట్లు, ఈ నిర్మాణం పర్మార్ రాజవంశానికి చెందిన 1,000 సంవత్సరాల పురాతనమైనదని సోలంకి చెప్పారు. ఆలయం చుట్టూ మరింత తవ్వకం చేస్తే సుమారు 2,600 సంవత్సరాల క్రితం విక్రమాదిత్య కాలం నుండి శేషాలను తీసుకురావచ్చని సోలంకి తెలిపారు. చారిత్రక, పురావస్తు ప్రాముఖ్యత ఉన్న ప్రతిదీ భద్రంగా ఉండేలా నిపుణుల పర్యవేక్షణలో ఈ స్థలంలో మరింత తవ్వకం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు.