అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు హైదరాబాద్ నుంచి భారీ యంత్రాలు వెళ్లబోతున్నాయి. సెప్టెంబర్ 17 తర్వాత టెంపుల్ నిర్మాణం జోరుగా సాగుతుందని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శనివారం చెప్పారు. హిందువులు తమ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలిపిన కాలం పిత్రు పక్ష్ ఈనెల 17 వరకు ముగియనుందని ఆ తరువాత పనులు ప్రారంభమై నిరాటంకంగా కొనసాగుతాయని ఆయన వివరించారు. 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించడానికి దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎల్ అండ్ టీ సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆలయ పునాది కోసం సుమారు 1,200 స్తంభాలను భూమి నుంచి 100 అడుగుల లోతులో వేయనున్నట్లు తెలిపారు. ఈ స్తంభాలు రాతి, ఇనుముతో చేయబడి ఉంటాయని పేర్కొన్నారు. సుమారు 100 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారని వారందరికీ ముందే కరోనా పరీక్షలు చేయిస్తామని ఆయన తెలిపారు.