
రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ మృతి పట్ల రాజసభ నివాళి అర్పించింది. కర్నాటకకు చెందిన రాజ్యసభ సిట్టింగ్ సభ్యుడు, ఎంపీ అశోక్ గస్తీ.. గురువారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో ఆయన స్వగ్రామం. ఆయన మృతి పట్ల ఇవాళ రాజ్యసభ నివాళి అర్పించింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభలో మాట్లాడుతూ.. అశోక్ గస్తీ అడ్వకేట్‌గా పనిచేసినట్లుగా సభకు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజాసేవలో ఉన్నారని అన్నారు.
విద్యార్థి దశ నుంచే అశోక్ గస్తీతో తనకు పరిచయముందని అన్నారు. చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని తెలిపారు. వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అశోక్ గస్తీ పోరాడినట్లుగా వివరించారు. ఈ ఏడాది జూన్ 26వ తేదీన ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు.
మాజీ ఎంపీ కపిల్ వాత్సాయన్ మృతి పట్ల కూడా సభ నివాళి అర్పించింది. 91 ఏళ్ల వాత్సాయన్ కేంద్ర ప్రభుత్వ సెక్రటరీగా చేశారు. అనేక అవార్డులు గెలుచుకున్నారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, సంగీతనాటక అకాడమీ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఎంపీల మృతి పట్ల రాజ్యసభ సభ్యులు ఓ నిమిషం మౌనం పాటించారు.