క్యారమ్ బోర్డును తీసుకోలేదన్న కోపంతో ఒక భర్త తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు. రాజస్థాన్‌లోని బారన్ జిల్లా కోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బారన్ జిల్లాలోని అంతా పట్టణంలో ఉంటున్న షబ్రూనిషా తన భర్త షకీల్ అహ్మద్ పై గతంలో గృహహింస కేసు పెట్టింది. భార్యభర్తలిద్దరికీ కుటుంబతగాదాలు ఉండటంతో ఆమె తన కుమారుడితో కలిసి తన పుట్టింట్లో ఉంటోంది. అయితే ఈ కేసుకు సంబంధించి మంగళవారం వారిద్దరూ కోర్టులో హాజరయ్యారు. ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో తమ కుమారుడికి క్యారమ్ బోర్డు కొనిస్తానని షకీల్ చెప్పారు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపం పట్టలేక షకీల్ ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. కాగా, ట్రిపుల్ తలాఖ్ చెప్పే సాంప్రదాయాన్ని జూలై 30న పార్లమెంట్ చట్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి షకీల్‌పై ట్రిపుల్ తలాక్ చెప్పాడని.. ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ చట్టం కింద షకీల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడిని ఇంకా అరెస్టు చేయలేదు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కోట ప్రాంతంలో ట్రిపుల్ తలాఖ్‌కు సంబంధించిన ఇది ఐదవ కేసు.