మత్తులో జోగుతున్న ఎక్సైజ్‌శాఖ..పాలమూరులో ఏరులైపారుతున్న కల్తీ కల్లు..ఇప్పటికే ఇద్దరు మృతి..
పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు ఏరులైపారుతోంది. పట్టించుకునే నాథుడు లేకపోవడంతో నాటుసారా కూడా గుప్పుమంటోంది. పల్లెలు, బస్తీల్లో మళ్లీ నాటుసారా తయారీ, సరఫరా పెరిగిపోవడంతో జనం మత్తులో మునిగితేలుతున్నారు.

పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు ఏరులైపారుతోంది. పట్టించుకునే నాథుడు లేకపోవడంతో నాటుసారా కూడా గుప్పుమంటోంది. పల్లెలు, బస్తీల్లో మళ్లీ నాటుసారా తయారీ, సరఫరా పెరిగిపోవడంతో జనం మత్తులో మునిగితేలుతున్నారు. అయితే ఈ మత్తు ఇప్పుడు వారి ప్రాణాల మీదకు వచ్చింది. కల్తీ కల్లుకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్లకు చెందిన ఖాసీం, వెంకటేశులు కల్తీ కల్లు తాగి మృతి చెందారు. వీళ్లిద్దరూ శ్రీనివాస్ అనే మరో వ్యక్తితో కలిసి జడ్చర్ల సమీపంలోని ఆలూరు గ్రామంలో పీకలదాకా కల్లు తాగారు. అయితే కొద్దిసేపటి తర్వాత ముగ్గురు తూలుతూ కిందపడిపోయారు. పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేశ్, ఖాసీంలు ఇద్దరు మార్గ మధ్యంలోనే చనిపోయారు. మరోవ్యక్తి శ్రీనివాస్ పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై మృతుల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలూరు గ్రామానికి వెళ్లి ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు పోలీసులు. అక్కడున్న కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే కల్తీకల్లు ప్రాణాలు తీస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా గ్రామాల్లో కల్తీకల్లు అమ్మకాలపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
గత కొంతకాలంగా తెలంగాణలో నాటుసారా తయారీ తగ్గిపోయింది. ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించి నాటుసారా భట్టిలను ధ్వంసం చేయించింది. పోలీసులు కూడా కొన్ని నెలల పాటు ఫోకస్ పెట్టడంతో చాలా ప్రాంతాల్లో నాటుసారా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు పాలమూరు జిల్లాలో మళ్లీ కల్తీ కల్లు తాగి ఇద్దరు చనిపోవడంతో ఇటు ఎక్సైజ్, అటు పోలీస్ అధికారులు కూడా అలర్టయ్యారు.