కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలో దేనికి మెజారిటీ రాదని ఆయన అన్నారు. ఒక్క పార్టీకే మెజార్టీ ఇస్తే ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని.. అందుకే సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. పనిచేసిన వ్యక్తులను చూసే ప్రజలు ఓటేయాలని ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ సూచించారు. అలాగే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సఫలమౌతాయని ఆయన చెప్పారు.
ఇక ఉగ్రవాద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సాధ్వీ ప్రఙ్ఞాసింగ్ ఠాకూర్‌కు బీజేపీ ఎలా టికెట్ ఇస్తుందని మండిపడ్డ ప్రకాశ్ రాజ్.. ఇలాంటి వారు పార్లమెంట్‌కు వెళ్లి ఎలాంటి చట్టాలు చేస్తారని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన బెంగళూరు సెంట్రల్ ఎన్నికల్లో తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చానని.. తనకు గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యా, వైద్య రంగంలో ఆమ్ ఆద్మీ పార్టీ పని.. దేశానికి ఆదర్శప్రాయమని అందుకే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నానని తెలిపారు.