ఏపీ రాజధాని అమరావతి లోని ఉండవల్లిలో జోరుగా సాగిన ప్రజావేదిక కూల్చివేత పనులు ముగిశాయి. కొన్ని గంటలపాటు ఏకధాటిగా సాగిన ఈ పనులు రెండు ప్రధాన పార్టీల మధ్య కొనసాగిన ప్రత్యక్ష, పరోక్ష ‘ వార్ ‘ కు ఇది నాంది అని చెప్పవచ్చు. కనీసం నోటీసైనా ఇవ్వకుండా ఈ పది కోట్ల విలువైన కట్టడాన్ని కూల్చివేయడానికి దారి తీసిన పరిస్థితులేమిటి ? వైసీపీ అధికారంలోకి రాగానే ఈ నిర్ణయమెందుకు తీసుకుంది ? అవినీతితో కూడిన కట్టడాల కూల్చివేత అన్నది రాజ్యాంగబధ్ధమేనా, న్యాయ సమ్మతమేనా అని విశ్లేషించినప్పుడు చట్టాలు పూర్తి న్యాయబధ్ధమేనంటున్నాయి. కూల్చివేత పనులపై స్టే విధించేందుకు హైకోర్టు కూడా నిరాకరించింది. కూల్చివేతకు కారణంగా భావిస్తున్న చట్టాల నేపథ్యమేమిటి ? దేశంలో జలవనరుల పరిరక్షణకు నదులు, నదీ గర్భాలు, వాటి పరీవాహక ప్రాంతాల్లో కాంక్రీటు కట్టడాలపై సుప్రీంకోర్టు గతంలోనే నిషేధం విధించింది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. 1994 లో ఎంసీ మెహతా వర్సెస్ కమలనాథ్ కేసులో..నదీ పరీవాహక ప్రాంతాల్లో కట్టడాలు చట్ట విరుధ్దమని కోర్టు పేర్కొంది. అప్పట్లో హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదీ పరీవాహక ప్రాంతంలో వెలసిన అక్రమ కట్టడాలపై ఓ ఇంగ్ల్లీష్ డైలీలో వచ్చిన కథనాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించింది. బియాస్ నది వద్ద గల ఈ కట్టడాలను తొలగించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా గాలి, నీరు, నదులు, సముద్రాలు, అడవులు ఏ ఒక్కరి సొంతం కాదని.. ఇవి మానవాళికి చెందినవని స్పష్టం చేసింది. ఇవి ప్రకృతి మనకు ప్రసాదించిన గిఫ్ట్.. వీటిని ఎవరూ ఎంక్రోచ్ (ఆక్రమణ) చేయడానికి వీల్లేదు అని అత్యున్నత న్యాయస్థానం వివరించింది. ఇదే సందర్భంలో.. ఇండియన్ లీగల్ సిస్టం లో డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ థియరీని వర్తింపజేయడానికి అన్ని అవకాశాలూ ఉన్నట్టు పేర్కొంది. రోమన్ న్యాయ చట్టాల్లో ఈ థియరీ కూడా ఒకటి. ప్రజల వర్తమాన, భవిష్యత్ తరాల భద్రత, రక్షణ వంటివాటికి ఈ విధమైన థియరీ ఉపయోగపడుతుందని, పైగా ఈ భూమిపైని సహజ వనరులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని హ్యూమన్ ఎన్విరాన్ మెంట్ పై గల స్టాక్ హామ్ డిక్లరేషన్ కూడా గతంలోనే వివరించింది. పర్యావరణానికి హాని చేసే కట్టడాలను తొలగించవచ్చు.. ఇందుకు చట్టాలు అనుమతిస్తున్నాయి అని ఈ డిక్లరేషన్ క్లారిటీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. విజయవాడకు సమీపంలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో మొత్తం 52 నిర్మాణాలపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి హైకోర్టులో ‘ పిల్ ‘ వేశారు. ఈ కేసులో 15 వ ప్రతివాది ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న ఇంటియజమాని లింగమనేని రమేష్ నుంచి కౌంటర్ కోరారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులో కౌంటర్ దాఖలులో నిర్లక్ష్యం వహించడంతో కోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతూ వచ్చింది. కృష్ణా నది కరకట్ట ప్రాంతంలోని కట్టడాలకు నాడు సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు వర్తిస్తుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.