ఆయనకు లైన్ క్లియర్ అయింది. కానీ ఇంకో మెలిక పడింది. ఆయన కొండపై రీ ఎంట్రీ ఇవ్వాలంటే ఇప్పుడో ఓ కమిటీ క్లియరెన్స్ ఇవ్వాలి. ఆయన్ని తీసుకోవాలా? లేదా అనే పాయింట్ తేల్చాలి. దీంతో ఆయన ఏడు కొండలపై కనిపించాలంటే మరింత టైమ్ పట్టేలా ఉంది.
టీటీడీ ప్రధానార్చక పదవి తొలగించబడ్డ రమణ దీక్షితులు కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు సానుకూల వాతావరణం ఏర్పడింది. టీటీడీలో మళ్లీ ఆయన రీ ఎంట్రీకి పాజిటివ్ వెదర్ ఏర్పడినట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆయన తిరిగి టీటీడీలోకి రావడం ఖాయమని అనుకున్నారు. కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ఉత్తర్వులు అడ్డంకులుగా మారాయి. అవి ఇప్పుడు తొలిగిపోయి రమణ దీక్షితులు తిరిగి తిరుమలలో అడుగు పెడతారని తెలుస్తోంది.
గతంలో టీటీడీలో జరిగే పరిణామాలపై ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు రమణ దీక్షితులు. పలు వివాదాలను ఆయన రేపడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. ప్రధాన అర్చకుల హోదా నుంచి తొలగించారు. అర్చకులకు వయో పరిమితి విధించిన ఆయన్ని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు జగన్ సర్కార్ అర్చకుల వంశపారంపర్య హక్కులను మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ చట్టం 1987లోని సవరణలు మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. వంశపారంపర్య హక్కుల వల్ల అర్చకులకు పదవీ విరమణ ఉండదని తెలిపింది. అయితే ఈ జీవో టీటీడీకి మినహాయింపు ఇచ్చింది.ఈ జీవో సోమవారం విడుదలైంది. ఇప్పుడు ఈ జీవోను బుధవారం సమావేశమైన టీటీడీ పాలకమండలి కూడా ఆమోదించింది. దీంతో టీటీడీలో రమణదీక్షితుల ఎంట్రీకి లైన్ క్లియర్ అయిందని అనుకున్నారు. అయితే ఇక్కడో మెలిక కూడా బోర్డు పెట్టినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలో తీసుకోవడంతో పాటు…పాత పోస్టులో తీసుకోవాలనే విషయంపై ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ రమణ దీక్షితుల రీ ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాతే రమణదీక్షితులు రీ ఎంట్రీపై టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.