పీఎంసీ బ్యాంకు స్కామ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకుశివసేన నేత సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ మరింత వ్యవధిని కోరారు. మంగళవారం ఆమె ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇదివరకు ఈ దర్యాప్తు సంస్థ ఆమెకు రెండు సార్లు సమన్లు పంపింది. అయితే అప్పుడు కూడా ఆమె ఈడీ ఎదుట హాజరు కాకుండా అనారోగ్య కారణాలు చూపారు. మూడో సారి జారీ చేసిన సమన్లకు ఆమె ఇలా సమాధానం పంపారు. పంజాబ్-మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించి రుణాల మంజూరులో అవకతవకలు జరిగినందుకు లోగడ రిజర్వ్ బ్యాంకు దీన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కస్టమర్ల విత్ డ్రాల్స్ పై పరిమితులు విధించింది. దీంతో ఈ బ్యాంకుకు ఉన్న సుమారు 9 లక్షలమంది డిపాజిటర్లు తీవ్ర ఆందోళన చెందారు.
కాగా తన భార్యకు ఈడీ సమన్లు పంపడంపై మండిపడిన సంజయ్ రౌత్.. తన వద్ద 121 మంది బీజేపీ నేతల పేర్లతో కూడిన ఫైలు ఉందని, దాన్ని ఈడీకి ఇస్తానని ప్రకటించారు. తన భార్య టీచర్ అని, బీజేపీ నేతల్లా కాక, తమ ఆదాయం 1600 కోట్లు మించలేదని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం ఇంటి కొనుగోలు కోసం వర్ష తన ఫ్రెండ్ దగ్గర 50 లక్షల రుణం తీసుకుందని, ఈ నేపథ్యంలో గత నెల నుంచి తను ఈడీతో టచ్ లో ఉన్నానని ఆయన వెల్లడించారు. మేం మధ్యతరగతికి చెందినవాళ్లం.. నా భార్య తీసుకున్న అప్పు గురించి ఐటీ శాఖకు ఇదివరకే తెలియజేశాను..పదేళ్ల అనంతరం ఈడీ ఇప్పుడు మేల్కొంది అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. అటు-. శివసేన కార్యకర్తలు నిన్న ముంబైలోని ఈడీ కార్యాలయం ముందు’ బీజేపీ కార్యాలయం ‘అని రాసి ఉన్న బ్యానర్ కట్టి సంచలనం రేపారు.