PM Modi in Tamil Nadu Tour : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పుదుచ్చేరి, కోయంబత్తూరులో పర్యటించనుండడంతో ఆ రెండు ప్రాంతాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రధాని పలు ప్రభుత్వ పథకాలను ప్రారంభించడంతోపాటు రెండు చోట్ల బహిరంగ సభల్లోనూ ప్రసంగించనున్నారు. మోదీ పర్యటించనున్న ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు హై అలర్ట్‌ను ప్రకటించారు.
గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ప్రధాని మోదీ చెన్నై విమానాశ్రయం చేరుకుంటారు. చెన్నై విమానాశ్రయం నుంచి ఆయన హెలిక్యాప్టర్‌లో బయల్దేరి పుదుచ్చేరి లాస్‌పేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి మోదీ కారులో కోరిమేడులోని జిప్మర్ ఆడిటోరియంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అలాగే, రూ.2426కోట్ల వ్యయంతో కారైక్కాల్ మీదుగా విల్లుపురం సదానందపురం నుంచి నాగపట్టినం దాకా నిర్మించనున్న నాలుగు రహదారులతో కూడిన జాతీయ రహదారికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఆ తరావ్త జిప్‌మర్ ఆసుపత్రి ప్రాంగణంలో రూ.491 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైద్యకళాశాల కొత్త భవనానికి భూమిపూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను ముగించుకుని కారులో బయల్దేరి లాస్‌పేట హెలిపాడ్ మైదానం చేరుకుని అక్కడ జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ రాకను పురస్కరించుకుని టాస్క్‌ఫోర్స్ దళం కమాండెంట్ రవీంద్రన్ నాయకత్వంలో 120 మంది కమెండోలతో భద్రత కల్పించనున్నారు. సుమారు 300 మంది కేంద్రపారిశ్రామిక రక్షణదళానికి చెందిన 300 మంది కూడా ఈ భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ప్రధాని ప్రయాణించనున్న ఎయిర్‌పోర్టు రోడ్డు, ఈసీఆర్ రోడ్డు, కామరాజర్ రోడ్డు తదితర రహదారులకు ఇరువైపులా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. డీజీనీ రణవీర్‌సింగ్ కిషన్యా, ఏడీజీపీ ఆనంద్‌మోహన్ ఈ భద్రతాఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని ప్రయాణించే మార్గాలలో వాహనాల రాకపోకలపై నిషేధ అంక్షలు విధించింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం.
బహిరంగ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.20 గంటలకు పుదుచ్చేరి విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి చెన్నై విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 2.10 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 3.35 గంటలకు కోయంబత్తూరు నగరానికి చేరుకుంటారు.
కోయంబత్తూరు కొటీసియా మైదానంలో ఏర్పాటు చేసి భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొని రూ.12,400 కోట్ల వ్యయంతో పూర్తయిన కొత్త పథకాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సభలో నైవేలిలో రూ.8వేల కోట్లతో 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు.
కాగా, ప్రధాని తమిళనాడుకు రానున్న సందర్భంగా ‘దేశాభివృద్ధిలో తమిళనాడు భాగస్వామ్యం ఎంతో వుంది. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచప్రసిద్ధి పొందాయి. తమిళనాడు అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావడం గౌరవంగా వుంది. రేపు కోయంబత్తూరులో నేను పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందాన్ని కలిగిస్తోంది’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.
Read Also.. బెంగాల్‌లో హీటెక్కుతున్న ఎలక్షన్ పాలిటిక్స్.. పోటాపోటీగా సెలబ్రిటీలకు గాలం వేస్తున్న ప్రధాన పార్టీలు..