బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై కపిల్ సిబల్ తరువాత ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత పి.చిదంబరం వంతు వచ్చింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కువసీట్లకు పోటీ చేసి ఉంటే బాగుండేదేమో అని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, కర్నాటక రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాల గురించి తానెంతో ఆందోళన చెందానని ఆయన చెప్పారు. పార్టీకి సంస్థాగతంగా ఎలాంటి ఉనికి లేదని, లేదా గణనీయంగా పార్టీ స్థాయి దిగజారిందని ఈ రిజల్ట్స్ నిరూపించాయన్నారు. బీహార్ లో ఆర్జేడీ-కాంగ్రెస్ గెలిచి ఉండేదని, విజయానికి చేరువైనప్పటికీ ఎందుకు ఓడిపోయామన్నది సమగ్రంగా సమీక్షించుకోవాల్సి ఉందన్నారు. కొద్ది కాలం క్రితమే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిందన్న విషయాన్ని మరువరాదని చిదంబరం చెప్పారు. ఇక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరగవలసి ఉన్న ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. ఏం జరుగుతుందో చూడాలన్నారు.