ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు..అటువంటి ఉల్లి ధరలు పరుగులు పెడుతున్నాయి. కోయకుండానే వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా ఉల్లి ధరలు పెరగనున్నయనే అంచనాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఉత్తర కర్నాటకలో కురిసిన వర్షాలు ఖరీఫ్ పంటను ప్రభావితం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉల్లి ధరలు పెరగడంతో ముందుముందు ఆ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కర్నాట మార్కెట్లో ఉల్లిధర ఆగస్టు మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 40 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. లాసాల్ గావ్ ప్రాంతం నుంచి రావాల్సిన పంట చేతికి రాకపోతే ఉల్లిపాయల ధర విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు ఉల్లి వర్తకులు. మరోవైపు ఉల్లిపాయల ఉత్పత్తికి మరో ప్రధాన మార్కెట్ అయిన మహారాష్ట్ర రైతులు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ఉల్లిని మార్కెట్‌కు తరలించకుండా, గోదాముల్లోనే దాచిపెడుతున్నారు. ముందస్తు అంచనాలతో రైతులు ఇలా చేస్తున్నారని వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఉల్లిపాయ ధరలు సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నాయి.