సాఫ్ట్‌వేర్ కంపెనీకి సంబంధించిన అత్యంత కీలకమైన డేటాను లీక్ చేసి.. ఆ కంపెనీ యజమాని ఆత్మహత్యకు కారణమయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో పనిచేసి వచ్చిన అశోక్‌వర్మ, సుధీర్‌వర్మ మాదాపూర్ మైండ్‌స్పే్‌సలో రిపోర్ట్ గార్డెన్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించారు. పలువురు ఉద్యోగులను నియమించుకుని వివిధ కంపెనీలకు సేవలందిస్తున్నారు. వీరిలో మియాపూర్‌కు చెందిన షేక్ హుస్సేన్ నమ్మకంగా, క్రమశిక్షణతో పనిచేస్తుండడంతో.. అతనికి కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అశోక్‌వర్మ, సుధీర్‌వర్మ కంపెనీ విస్తరణలో భాగంగా ప్రస్తుత సంస్థను ఇతరులకు విక్రయించే ప్రయత్నంలో ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న హుస్సేన్.. కంపెనీని ఇతరులకు విక్రయిస్తే.. నెలకు లక్షకు పైగా జీతం వచ్చే తన ఉద్యోగానికి భద్రత ఉండదనే కుట్రలు పన్నాడు. ఇదే క్రమంలో కంపెనీకి చెందిన డేటాను మాజీ ఉద్యోగుల మెయిల్స్ ద్వారా లీక్ చేశాడు. అమెరికాలో ఉన్న అశోక్ వర్మకు విషయం తెలియడంతో.. తాము పడ్డ కష్టమంతా వృథా అయిందనే బాధతో అశోక్‌వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మరోవైపు కంపెనీ డేటా లీకయిందన్న అనుమానంతో మరో అధినేత సుధీర్‌వర్మ ఆఫీసు కంప్యూటర్లను పరిశీలించగా.. అది హుస్సేన్ పని అని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో హుస్సేన్ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు.