One more election scheduled in Telangana: తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ముగిసాయి.. ఇక మూడున్నరేళ్ళ దాకా ఏ ఎన్నికలు లేవని అందరూ అనుకుంటుంటే… సడన్‌గా మరో ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం సాయంత్రం షెడ్యూలు జారీ చేసింది. ఈ ఎన్నికలకు మార్చి 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి.. ఏప్రిల్ 7వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
తెలంగాణలో ఏప్రిల్ ఏడవ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం క్రింద ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపై వేటు పడడంతో ఖాళీ అయిన స్థానిక సంస్థల కోటాలోని నిజామాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. కేంద్ర ఎన్నికల కమిషన్.
టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భూపతిరెడ్డి ఫిరాయించడంతో ఆయనపై గులాబీ పార్టీ శాసనమండలి ఛైర్మెన్‌కు ఫిర్యాదు చేసింది. దాంతో కౌన్సిల్ ఛైర్మెన్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేశారు. కానీ తనపై అనర్హత వేటు చెల్లదంటూ భూపతి రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా శాసన మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ మేరకు సీఈసీ షెడ్యూల్ ప్రకటించింది.
అయితే ఈ ఎమ్మెల్సీ పదవి కాలం మరో రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి వుంది. గురువారం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్ ఏడో తేదీన ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎమ్మెల్సీ కోసం టిఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నారు. కానీ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి అభ్యర్థిత్వంపై కేసీఆర్ ఫర్మ్‌గా వున్నట్లు ప్రచారం జరుగుతోంది.