ఢిల్లీ మెట్రోలోని అన్ని లైన్లలో మెట్రో సేవలను ప్రారంభించడంతో శనివారం మొత్తం లక్షన్నరమంది ప్రయాణాలు సాగించినట్లు ఢిల్లీ మెట్రో అధికారుల ప్రకటించారు. సమయ్‌పూర్ బాదలీ- గురుగ్రామ్ మధ్య ఎల్లో లైన్ మెట్రోలో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు వెల్లడించారు.ద్వారకా- నజఫ్‌గఢ్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య అత్యల్పంగా ఉన్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మెట్రో రైలు సర్వీసు సేవలు మొదలయ్యారు. 169 రోజుల తర్వాత ఢిల్లీ మెట్రో పరుగులు తీసింది. మార్చిలో విధించిన లాక్‌డౌన్ నుంచి మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. కరోనా వైరస్ నేపథ్యంలో పలు నగరాల్లోని మెట్రో సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. అయితే, అన్‌లాక్4 దశలో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి ఢిల్లీ, నోయిడా, లక్నో, బెంగుళూరు, చెన్నై, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లో మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీలో ఎల్లో, బ్లూ, రెడ్ లైన్‌లో సర్వీసులు నడుస్తున్నాయి. కేవలం స్మార్ట్ కార్డు ద్వారానే ఎంట్రీ కల్పిస్తున్నారు.
ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఢిల్లీ మెట్రోలో మొత్తం 1,52,845 మంది ప్రయాణించారు. వీరిలో అత్యధికంగా 44,949 మంది ఎల్లోలైన్, బ్లూ లైన్ మెట్రోలలో 42,177 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కాగా, ద్వారక-నజఫ్‌గఢ్ మార్గంలో అత్యల్పంగా 621 మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే శనివారమే ప్రారంభమైన ఎయిర్ పోర్టులైన్‌లో 2,268 మంది ప్రయాణాలు సాగించినట్లు ఢిల్లీ మెట్రో అథారిటీ వెల్లడించింది.