కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అలజడి సృష్టిస్తోన్న తరుణంలో..దాని వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరచాలనానికి ప్రస్తుతానికి గుడ్‌బై చెప్పి.. నమస్తే, చేతులు గాల్లో ఊపడం, ఫిస్ట్ బంప్ వాటివైపు మొగ్గు ప్రజలు చూపుతున్నారు.
అయితే తాజాగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ మధ్య కొత్త పలకరింపు చిగురించింది. వారు రెండు మోచేతులను ఆనించుకొని పలకరించుకున్నారు. డిఫెన్స్ సెక్రటరీ మార్క్ టి ఎస్పర్‌ను అజిత్ ఈ విధంగానే ఆహ్వానించారు. ఈ సరికొత్త ‘ఎల్బో బంప్’ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కాగా, కరోనా నిబంధనలు పాటిస్తూ దిల్లీలో భారత్, అమెరికాకు చెందిన నేతలు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అందరూ మాస్క్‌లు ధరించారు. మైక్ పాంపియో అమెరికా జాతీయ జెండాను పోలిన మాస్క్‌ను ధరించి భిన్నంగా కనిపించారు. ఇదిలా ఉండగా.. భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో..అమెరికా ఉన్నత స్థాయి నేతలు భారత్‌లో పర్యటించడం, రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయడం గమనార్హం.