సన్‌బర్న్ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ (ఇడిఎం) ఫెస్టివల్‌లో ముగ్గురు పర్యాటకులు మృతి చెందడంపై ప్రతిపక్ష పార్టీలు గోవా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కాగా.. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి గోవింద్ గవాడే మాట్లాడుతూ “సన్‌బర్న్ ఫెస్టివల్ కు హాజరుకావాలని ప్రభుత్వం యువతను బలవంతం చేయడం లేదు. వారు స్వయంగా వెళతారు. ఎవరూ అక్కడికి వెళ్ళమని బలవంతం చేయరు” అని పేర్కొన్నారు.
వేదిక వద్ద మాదకద్రవ్యాలను బహిరంగంగా విక్రయించారని కాంగ్రెస్ ఆరోపించింది మరియు సన్‌బర్న్ ఫెస్టివల్ కు అనుమతి రద్దు చేయాలని, మరణాలపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ మరణాలపై గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి) సిబిఐ దర్యాప్తు కోరింది. ఉత్తర గోవా జిల్లాలోని వాగేటర్ బీచ్ లోని ఫెస్టివల్ వేదిక వద్ద కుప్పకూలి గత మూడు రోజుల్లో ముగ్గురు పర్యాటకులు మరణించారు. మూడు రోజుల సన్‌బర్న్ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. పండుగ వేదిక వద్ద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు శుక్రవారం కుప్పకూలిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు.
ఆదివారం రాత్రి, బెంగళూరుకు చెందిన మరో పర్యాటకుడు వేదిక వద్ద అసౌకర్యానికి గురయ్యాడు, ఆసుపత్రికి తరలించిన కొద్ది నిమిషాల తరువాత అతడు మరణించాడు. ఇంత పెద్ద సంఖ్యలో జనం రావడానికి ప్రభుత్వం బాధ్యత వహించదని గవాడే అన్నారు. “మేము ఎవరికీ పాసులు పంపిణీ చేయటం లేదు. సంగీత ప్రియులు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు, వారు తమ ఇష్టానుసారం చేస్తారు” అని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డ్రగ్స్ బహిరంగంగా అమ్ముడయ్యాయని గోవా ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వరద్ మార్డోల్కర్ ఆరోపించారు. “నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు” అని ఆయన అన్నారు. ఈ విషయంలో పోలీసు సూపరింటెండెంట్ (నార్త్) ఉత్కర్ష్ ప్రసూన్ జోక్యం కోరిన కాంగ్రెస్ ఆదివారం ఈ ఫెస్టివల్ కు అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మరణాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని జిఎఫ్‌పి ఉపాధ్యక్షుడు దుర్గాదాస్ కామత్ డిమాండ్ చేశారు.