
ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం హాట్ హాట్‌గా సాగుతోంది. నిమ్మగడ్డ పునర్నియామకానికి సంబంధించి కోర్టులో జరిగిన వ్యవహారం తెలిసిందే. హైకోర్టు సూచనతో గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకుని భేటీ అయ్యారు.
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ ఉదయం(జులై 20) సమావేశం అయ్యారు. హైకోర్టు తీర్పుతో పాటూ మిగిలిన అంశాలపై గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. తిరిగి తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం అందజేశారు. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.