New Year Top 10 Good News: కొత్త సంవత్సరంలో టాప్‌ 10 గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్‌

|

Jan 01, 2021 | 5:34 PM

New Year Top 10 Good News: గ‌త ఏడాదికి వీడ్కోలు ప‌లికి కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం చెప్పేశాము. గ‌త ఏడాదిలో మ‌ర్చిపోలేని ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌య్యాము...

New Year Top 10 Good News: కొత్త సంవత్సరంలో టాప్‌ 10 గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్‌
Follow us on

New Year Top 10 Good News: గ‌త ఏడాదికి వీడ్కోలు ప‌లికి కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌తం చెప్పేశాము. గ‌త ఏడాదిలో మ‌ర్చిపోలేని ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌య్యాము. ఈ సంవత్స‌రంలోనైనా మంచే జ‌ర‌గాల‌ని అంద‌రు కోరుకుంటున్నారు. అయితే ఈ కొత్త ఏడాదిలో  టాప్ 10 గుడ్ న్యూస్ ఏంటంటే..

1. కొత్త ఏడాదిలో క‌రోనా వ్యాక్సిన్‌

ఈ నూత‌న సంవ‌త్స‌రంలో క‌రోనా వ్యాక్సినేషన్‌పై ఏ స‌మ‌యంలోనైనా శుభ‌వార్త వినిపించ‌బోతోంది కేంద్ర ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే వ్యాక్సిన్ అనుమ‌తి కోసం ఆస్ట్రాజెనెకా, సీర‌మ్ ఇన్సిస్టిట్యూట్ల కోవీషీల్డ్‌, ఫైజ‌ర్‌, భార‌త్ బ‌యోటెక్ కోవాగ్జిన్‌లు డీసీజీఐకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. అయితే ఆస్ట్రాజెనెకా, సీర‌మ్ డెవలప్‌ చేసిన కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ అనుమ‌తి ఇచ్చింది. టీకా అత్య‌వ‌స‌ర వినియోగంపై భేటీ అయిన క‌మిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అనుమతి తర్వాత వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది.

2. తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పీఆర్సీ

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పీఆర్సీ అమ‌లు చేస్తామంటూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ దిశ‌గా ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు ప్రారంభం అయ్యాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 33 శాతం పిట్‌మెంట్ ఇచ్చేందుకు స‌ర్కార్ సుముఖంగా ఉంది. ఇప్ప‌టికే పీఆర్సీపై నియ‌మించిన బిశ్వాల్ క‌మిటీ నివేదిక స‌మ‌ర్పించింది. స‌ర్కార్ నిర్ణ‌యంతో ఉద్యోగుల‌కు ల‌బ్ది చేకూర‌నుంది. మ‌రో వైపు ఆర్టీసీ, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేత‌నాల‌ను పెంచేందుకు ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ నిర్ణ‌యంతో మొత్తం 9 ల‌క్ష‌ల మందికి పైగా వేత‌నాలు పెర‌గ‌నున్నాయి.

3. ఈపీఎఫ్ ఖాతాదారుల‌కు న్యూఇయ‌ర్ గిఫ్ట్‌

ఈపీఎఫ్‌ ఖాతాదారులకు నూతన సంవత్సరం సందర్భంగా శుభవార్త చెప్పింది కేంద్రం. సుమారు ఆరు కోట్ల మందికి ఈపీఎఫ్‌ ఖాతాదారులకు వడ్డీరేటును అందించనుంది. 2019-20 సంవత్సరానికి గానూ వడ్డీని ఈపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌. 2020లో కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులు అనుకూలించనప్పటికీ.. పీఎఫ్‌ మొత్తంపై మొదటి విడతగా 8.5 శాతం వడ్డీని ఖాతాదారులకు అందించారు. గత ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్‌ కారణంగా మొదటి విడత 8.15 శాతం, రెండో విడతగా 0.35 శాతం చెల్లించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతను అందించింది. ఖాతాదారులు తమ పీఎఫ్‌ వివరాలు ఎస్‌ఎంఎస్‌, ఆన్‌లైన్ లో, అలాగే మిస్డ్‌ కాల్‌, ఉమాంగ్‌ యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

4. ఏపీ టెన్త్ విద్యార్థుల‌కు ఊర‌ట‌

ఏపీ ప్ర‌భుత్వం ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఊర‌ట క‌లిగించే ప్ర‌క‌ట‌న చేసింది. గ‌తేడాది మాదిరిగానే ఈ సారి కూడా ఒకే పేప‌ర్‌తో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. హిందీ మిన‌హాయిస్తే స‌బ్జెక్టుల‌కు రెండు పేప‌ర్ల‌లో ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ నేప‌థ్యంలో త‌ర‌గ‌తులు నిలిచిపోవ‌డం, భౌతిక దూరం వంటి నిబంధ‌న‌ల కార‌ణంగా గ‌త సంవ‌త్స‌రం పేప‌ర్ల స్థానంలో ఒకే పేపర్‌గా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల దాదాపు 3 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది.

5. ఏపీలో పాపుల‌ర్ బ్రాండ్ బీర్లు

ఏపీలో మద్యం ప్రియులకు మంచి బీర్ బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఏపీలో ద‌శ‌ల వారీగా మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తున్నారు. అయితే పాపుల‌ర్ బ్రాండ్ల‌కు చెందిన బీర్లు, ఆల్క‌హ‌ల్ అమ్మ‌కాల‌ను నిషేధించాయి. దీంతో బ్రాండ్ల పేరు లేని బీర్లే ఏపీ దొరుకుతున్నాయి. బ్రాండెడ్ బీర్లు కావాలంటే స‌రిహ‌ద్దులు దాటి వెళ్తున్నారు. ఇప్పుడు ప్ర‌భుత్వం రెండు పాపుల‌ర్ బ్రాండ్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో ఏపీలో ఉన్న ల‌క్ష‌లాది మంది మద్యం ప్రియులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

6. రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభవార్త‌

రైల్వే ప్ర‌యాణిక‌ల‌కు శుభ‌వార్త చెప్పింది ఐఆర్‌సీటీసీ. ఈ వెబ్ సైట్ లో టికెట్లు బుకింగ్‌తో పాటు భోజ‌నం, రిటైరింగ్ రూమ్స్‌, హోట‌ల్ బుక్ చేసుకునే సదుపాయం ఈ నూత‌న సంవ‌త్స‌రం నుంచి క‌ల్పిస్తున్న‌ట్లు ఐఆర్‌సీటీసీ ప్ర‌క‌టించింది. వీటితో పాటు స్టేష‌న్లలోకి ఎంట‌ర్ కాగానే ఎక్కాల్సిన రైలు ఏ ప్లాట్ ఫామ్ మీద‌కు వ‌స్తుందో కూడా నోటిఫికేష‌న్ ఇచ్చే స‌దుపాయం అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇక రెగ్యుల‌ర్‌, ఫేవ‌రేట్ జ‌ర్నీ ఆప్ష‌న్ల‌ను అందుబాటులోకి తెచ్చింది.

7. రిల‌య‌న్స్ జియో యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌

ఈ కొత్త ఏడాదిలో రిల‌య‌న్స్ జియో యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. జియో నుంచి ఏ నెట్ వర్క్ కు అయినా అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ చేసుకునే స‌దుపాయం క‌ల్పించింది. జియో నెట్ వ‌ర్క్ ప్రారంభ‌మైన కొత్త‌లో ఆ ఆఫ‌ర్ ప్ర‌జ‌ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించింది. అయితే దీనిపై ఇతర నెట్ వ‌ర్క్‌లు అభ్యంత‌రం చెప్పడంతో టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఉచిత కాల్స్ ఆఫ‌ర్‌పై ఆంక్ష‌లు విధించింది. ఆ ఆంక్ష‌లు డిసెంబ‌ర్ 31తో తొల‌గిపోవ‌డంతో మ‌రోసారి 2021 జ‌న‌వ‌రి 1 నుంచి జియో ఆఫ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

8. చిన్న వ్యాపారుల‌కు ఊర‌ట‌

చిన్న వ్యాపారుల‌కు ఊర‌ట‌నిచ్చే విధంగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌వ‌రి 1 నుంచి చిరు వ్యాపారులు నెల‌నెల రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఐదు కోట్ల‌లోపు టర్నోవ‌ర్ క‌లిగిన వ్యాపారులు ఇక‌పై మూడు నెల‌ల‌కు ఒక‌సారి రిటర్నులు దాఖ‌లు చేస్తే స‌రిపోతుంది. ఈ నిర్ణ‌యంతో దేశంలోని దాదాపు 94 ల‌క్ష‌ల మంది చిరు వ్యాపారుల‌కు ల‌బ్ది చేకూర‌నుంది.

9. చెక్కుల ద్వారా చెల్లింపుల్లో ‘పాజిటివ్ పే’ విధానం

చెక్కుల ద్వారా జ‌రిపే చెల్లింపుల్లో మోసాల‌ను అరిక‌ట్టేందుకు ఆర్బీఐ జ‌న‌వ‌రి 1 నుంచి ‘పాజిటివ్ పే’ అనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీంతో చెక్కుల ద్వారా మ‌రింత సులువుగా లావాదేవీలు జ‌రుపుకొనేందుకు అవ‌కాశం ఉంది. చెక్కుల వివ‌రాల‌ను మార్చే మోసాల‌ను అరిక‌ట్టేందుకు పాజిటివ్ పే విధానాన్ని తీసుకువ‌చ్చింది. 5 ల‌క్ష‌లు, ఆపై ఉన్న మొత్తాల‌కు జారీ చేసిన చెక్కుల‌ను బ్యాంకులు పునః స‌మీక్షించ‌నున్నాయి.

10. క్రికెట్ ప్రేక్ష‌కుల‌కు గుడ్‌న్యూస్‌

2021 ఐపీఎల్ సీజ‌న్‌లో ప్రేక్ష‌కుల‌ను స్టేడియంలోకి అనుమ‌తిస్తామ‌ని ప్ర‌క‌టించింది బీసీసీఐ. క‌రోనా కార‌ణంగా 2020 సీజ‌న్‌కు ప్ర‌క్ష‌కులు లేకుండానే ఐపీఎల్‌ను నిర్వ‌హించింది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ప్రేక్షకులను అనుమతించలేదు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం, రికవరీ రేటు ఎక్కువగా ఉండటం, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వ‌స్తుండ‌టంతో స్టేడియంలో 50 శాతం సామ‌ర్థ్యంతో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది.