జమ్మూలో పట్టునిలుపుకునేదెవరు.?: చక్రం తిప్పాలనుకుంటున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు గుప్‌కార్ కూటమి కొత్తఎత్తులు
జమ్ముకాశ్మీర్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత ఏడాది కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్‌లో..
Jammu and Kashmir DDC Election : జమ్ముకాశ్మీర్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత ఏడాది కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ము, కశ్మీర్‌లో తొలిసారిగా డీడీసీ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల జరిగిన లోకల్ ఎన్నికల్లో గుప్‌కార్ కూటమి ఆధిపత్యాన్ని చాటింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీతో జత కట్టబోతోంది గుప్‌కార్ కూటమి. ఇలా.. బీజేపీకి ఇక్కడ చెక్ పెట్టాలని వ్యూహం రచిస్తున్నారు కూటమి నేతలు. దీంతో ప్రకృతి సోయగంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన లోకల్ ఎన్నికల్లో 7 పార్టీలతో కూడిన గుప్‌కార్ కూటమి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇక్కడ బీజేపీకి చెక్ పెట్టాలంటే కాంగ్రెస్‌తో జత కట్టడమే వారికున్న ఏకైక మార్గం అనుకుంటున్నారు కూటమి నేతలు. అందుకే కాంగ్రెస్‌కి స్నేహ హస్తం అందిస్తున్నారు. జమ్ము కశ్మీర్ జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల ఫలితాల్లో గుప్కార్ కూటమి 110 సీట్లు సాధించి, మొత్తం 13 జిల్లాల్లో ఆధిపత్యం కొనసాగించింది. బీజేపీ పార్టీ సొంతంగా 75 సీట్లలో విజయం సాధించి ఆరు జిల్లాలను సొంతం చేసుకుంది. జమ్మూ ప్రాంతంలో బీజేపీ తన హవా కొనసాగింది. అటు, ఏడు పార్టీలతో కూటమిగా ఏర్పడ్డ గుప్కార్, కశ్మీర్‌లో పట్టు సాధించింది.
కాగా, నవంబర్ 28 నుంచి డిసెంబర్ 19 వరకు ఎనిమిది దశల్లో జమ్ములో ఎన్నికలు జరిగాయి. 20 జిల్లాల్లోని 280 డీడీసీ నియోజకవర్గాలకు పోలింగ్ చేపట్టారు. డీడీసీ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీకి 75 సీట్లు దక్కాయి. ఇక, ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ 67, ఇండిపెండెంట్ 50, జమ్మూకశ్మీర్ పీడీపీ 27, కాంగ్రెస్ 26, అప్నీ పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకున్నాయి. కశ్మీర్‌లో ఫారూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్ కూటమికి 72 సీట్లు దక్కాయి. అక్కడ బీజేపీ కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకున్నది. ఇక జమ్మూ ప్రావిన్సులో బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. జమ్మూ, ఉదమ్‌పూర్, సాంబా, కథువా, రీసాయి, దోడా ప్రాంతాల్లో బీజేపీ 71 సీట్లు సాధించింది. కశ్మీర్‌లో బీజేపీ తొలిసారి మూడు సీట్లను గెలుచుకుంది. అయితే ఏడు పార్టీలతో కూటమిగా ఏర్పడిన గుప్‌కార్ కూటమి జమ్మూలో కాంగ్రెస్‌తో జతకట్టి బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తోంది.