ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో 27 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో అయిదుగురి తలలపై లక్ష రూపాయల చొప్పున రివార్డులున్నాయి. సరెండర్ అయిన వీరందరికీ తక్షణ సాయంగా 10 వేల రూపాయల ఆర్థిక సాయంతో బాటు ఇతర ప్రయోజనాలను కల్పిస్తామని పోలీసులు చెప్పారు. లొంగిపోయినవారిలో దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్, క్రాంతికారీ మహిళా ఆదివాసీ సంఘటన్, చేతన నాట్యమండలి తదితర విభాగాలకు చెందినవారున్నారు. మావో సిధ్ధాంతాల పట్ల తాము విసుగు చెందామని, తిరిగి జనజీవన స్రవంతిలో చేరదలిచామని ఈ నక్సల్స్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి తగిన సదుపాయాలు కల్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వివిధ వృత్తుల్లో వీరికి శిక్షణ ఇచ్చి సమాజంలో వారికి తగిన స్థానం ఉండేలా చూస్తామని పేర్కొన్నారు.