బుసలు కొడుతూ ఫొని పోయింది. ముందస్తు జాగ్రత్తలతో పెనుముప్పు తప్పింది. కానీ భారీ వర్షాలు.. భీకర గాలులు ఉత్తరాంధ్రాలో బీభత్సం సృష్టించాయి. తీరం దాటే వేళ భారీ వర్షాలు.. ప్రచంఢ గాలులతో 14 మండలాలు చిగురుటాకులా వణికాయి.
ఫొని తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అధికంగా 20 సెంటీమీటర్లు, కంచిలి మండలంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 9 ఎన్డీఆర్ టీమ్‌లు, అగ్నిమాపక సిబ్బంది, అన్ని శాఖల అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 1500 మంది రెడ్‌క్రాస్ వాలంటీర్లు కూడా తమ సేవలందిస్తున్నారు. ప్రజలకు సురక్షిత నీరు, ఆహారం అందిస్తున్నామన్నారు. అత్యవసర వైద్యం కోసం 312 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. జిల్లాల వ్యాప్తంగా పెద్దఎత్తున అరటి, కొబ్బరి, జీడీ తోటలు ధ్వంసమయ్యాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు సహా కొన్ని చోట్ల ఇళ్లు కూడా కూలిపోయాయి.
కాగా.. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా బహుదా, వంశధార నదీ తీరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ నివాస్. వర్షాలు ఉన్నాయి కనుక వరదలు కూడా పొటెత్తే ప్రమాదముందని హెచ్చరించి అధికారులను అప్రమత్తం చేశారు.