
ఈ నెల 26 రిపబ్లిక్ దినోత్సవం రోజున ఎర్రకోటపై జాతీయ పతాకానికి అవమానం జరగడంపై దేశం దిగ్భ్రాంతి చెందిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ నెలలో దేశం ఎనో పండుగలు జరుపుకుందని, క్రికెట్ పిచ్ పై ‘మెన్ ఇన్ బ్లూ’ జట్టు ఘన విజయాన్ని ప్రజలు ఆనందంగా ఆస్వాదించారని ఆయన చెప్పారు. కానీ 26 వ తేదీన రెడ్ ఫోర్ట్ పై మన త్రివర్ణ పతాకానికి అవమానం జరగడం చాలా విచారకరమన్నారు. ఆదివారం తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. కొన్ని రోజుల క్రితమే దేశం… లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, బిహు పండుగలు జరుపుకుందని, ఇక మొదట్లో ‘తడబడినా’ఆ తరువాత ఆస్ట్రేలియాలో భారత జట్టు ‘ఎగసిపడి’ సిరీస్ గెలుచుకుందని పేర్కొన్నారు. మన టీమ్ హార్డ్ వర్క్ గురించి ఎంతయినా చెప్పుకోవలసిందే అని వ్యాఖ్యానించారు.
ఇక దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి ప్రస్తావించిన ఆయన.. ప్రపంచంలోనే మనది అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ అని , దేశ ప్రజలకు టీకా మందును త్వరగా ఇవ్వగలిగామని మోదీ పేర్కొన్నారు. (15 రోజుల్లో 30 లక్షలమంది కరోనా వారియర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు). కాగా ఇటీవలే నలుగురు భారతీయ మహిళా పైలట్లు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి నేరుగా బెంగుళూరుకు విమానం నడపడం విశేషమని ఆయన అన్నారు. 225 మంది ప్రయాణికులతో 10 వేలకు పైగా కిలోమీటర్ల దూరం ఈ విమానం ప్రయాణించి ఇండియా చేరిందన్నారు. ఏ రంగంలో నైనా మహిళల పార్టిసిపేషన్ పెరగడం ముదావహమన్నారు. మన దేశం నుంచి బెల్జియం తదితర దేశాలకు కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపినందుకు పలు దేశాధినేతలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ సైతం ఇండియాను అభినందిస్తూ సందేశాలు పంపారని మోదీ తెలిపారు.