తినటమంటూ మొదలెడితే.. ఎక్కడ వరకూ వెళ్తానో నాకే తెలీదు.. అదే నాకున్న పెద్ద వీక్నెస్ అని టీడీపీ యువ నేత నారా లోకేష్ గతంలో ఒక ఇంటర్వూలో చెప్పారు. అయితే, ఆ విషయంలో ఎంతటి కఠోర శ్రమ, నియమాలు పాటించారో.. ఏకంగా 20కేజీలు తగ్గిపోయారు లోకేష్. లాక్ డౌన్ సమయంలో దీనిపై ఆల్రెడీ ఒక సారి స్పందించారాయన. అయితే ఇప్పుడు మళ్లీ విజయవాడ వేదికగా ఈ సంగతి హైలైట్ అయింది. వైసీపీ నాయకుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి, టిడిపి నాయకుడు కొల్లు రవీంద్రను ఓదార్చడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడకు వచ్చారు. లోకేష్ ను చూసి టీడీపీ నాయకులు, మీడియా సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఏంటి సర్.. ఇంత సన్నబడిపోయారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏంటి దీనివెనుక ఉన్న రహస్యమనడిగి చెప్పేదాకా వదలలేదు మీడియా సిబ్బంది. లాక్ డౌన్ సమయంలో నైక్ ట్రైనింగ్ క్లబ్ (ఎన్‌టిసి) యాప్ సహకారంతో వర్కౌట్స్ చేయడం ద్వారా 20 కిలోల బరువు తగ్గినట్లు లోకేష్ తన ఫిట్ నెస్ సీక్రెట్ బయటపెట్టారు. ప్రతిరోజూ ఒక గంట పాటు వర్కౌట్స్, ఉడికించిన కూరగాయలు తిని ఒళ్లు తగ్గించానని లోకేష్ చెప్పారు.