రక్తం పెరిగి శరీరం బలంగా మారిపోద్ది.. మటన్‌లోని ఈ పార్ట్ వారానికి ఒకసారి తినండి చాలు..
మటన్ లివర్ పోషకాలతో నిండిన ఆహారం. ఇందులో ఐరన్, విటమిన్ బి12, విటమిన్ ఎ, ప్రోటీన్, ఫోలేట్ వంటి కీలక పోషకాలు లభిస్తాయి. ఇవి ఎర్ర రక్తకణాల తయారీకి, కంటి చూపు, నాడీ వ్యవస్థ పనితీరుకు తోడ్పడతాయి. అయితే ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఎంత మోతాదులో తినాలి? ఎవరు జాగ్రత్తపడాలో తెలుసుకోండి.

వీకెండ్ వచ్చిందంటే చాలు.. మాంసాహార ప్రియుల ఇళ్లలో ఘుమఘుమలాడే వంటకాల సందడి మొదలవుతుంది. చికెన్, మటన్ తో పాటు చేపలు, రొయ్యలు వంటి రకరకాల రుచులపై అందరూ దృష్టి సారిస్తారు. వాస్తవానికి మేక పార్ట్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. చాలామంది మటన్ లివర్ తిల్లి, తలకాయ, కాళ్లు, బోటి ఇలా ఎన్నో రకాల భాగాలను ఇష్టంగా తింటారు. వీటన్నింటి మధ్య భిన్నమైన రుచితో, అపారమైన పోషకాల గనిగా నిలిచేది మటన్ లివర్.. శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని.. శరీరాన్ని బలంగా మార్చుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మటన్ లివర్ తినడం వల్ల శరీరానికి అందే పోషకాలు
రక్తవృద్ధి – చురుకుదనం: ఇందులో ఇనుము (ఐరన్) సమృద్ధిగా లభిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.. తద్వారా నిస్సత్తువ, నీరసం తగ్గి శరీరం ఉత్సాహంగా పనిచేస్తుంది. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు కణజాలాల పునరుద్ధరణకు, జీవక్రియల సజావుగా సాగడానికి తోడ్పడతాయి.
కంటిచూపు, నాడీ వ్యవస్థకు రక్షణ: విటమిన్-ఎ కంటి చూపును పదునుదేర్చడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్-బి12 ఎర్ర రక్తకణాల తయారీకి, నాడీ వ్యవస్థ పనితీరుకు అండగా నిలిచి మెడ, భుజాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని కాపర్ ఆహారం ద్వారా లభించే ఐరన్‌ను శరీరం సులభంగా గ్రహించేలా సహకరిస్తుంది.
మెదడు చురుకుదనం – గర్భిణులకు మేలు: కోలిన్, విటమిన్-బి9 (ఫోలేట్) జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. గర్భిణులకు ఫోలేట్ ఎంతో ఉపయోగకరం.. పిండం ఎదుగుదలకు, పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి ఇది దోహదం చేస్తుంది.
ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎవరు జాగ్రత్తపడాలి?
పోషకాలు అధికంగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో తినడం శ్రేయస్కరం కాదు. వారానికి ఒకసారి మాత్రమే తినాలని, ప్రతిసారీ 100 గ్రాముల పరిమితిని మించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గౌట్ – కీళ్ల వాపు సంబంధిత సమస్య, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. మటన్ లివర్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. గర్భిణులు దీన్ని తినే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. సరైన పరిమితిలో, క్రమబద్ధంగా తీసుకున్నప్పుడే మటన్ లివర్ అసలైన ఆరోగ్య వరంలా పనిచేస్తుంది.
అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
