రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి దేశంలో ఎదురుగాలి వీస్తోంది. అధికారంపై పట్టును మరింత బిగించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలు కూడా అంతే దీటుగా ఎదుర్కొంటున్నాయి. విపక్షాలకు ప్రజలు కూడా మద్దతు పలకడంతో రష్యాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కౌన్సిల్ ఎన్నికల్లో తమను కూడా పాల్గొనేందుకు అనుమతించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే ఇందుకు ప్రభుత్వం అంగీకరించడంలేదు. శనివారం విపక్షాల పిలుపుతో పెద్ద సంఖ్యలో ప్రజలు మాస్కో వీధుల్లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వేలాది మంది పుతిన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పుతిన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి… . వెయ్యిమందికి పైగా అరెస్టు చేశారు. పోలీసులతో జరిగిన ఘర్షణల్లో కొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్దఎత్తున ఆందోళన జరగడం ఇదే మొదటిసారి. మాస్కో సిటీ డ్యుమా అభ్యర్థులు కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొనరాదన్న పుతిన్ ఆదేశాలను ధిక్కరించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడాన్నిఅనేకమంది వ్యతిరేకించారు. సెప్టెంబరు 8 న కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో తన మద్దతుదారులు పాల్గొని విజయం సాధించాలన్నది పుతిన్ కోర్కె. అందుకే విపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ మధ్య జరిగిన ఒపీనియన్ పోల్స్ లో లాయర్, అవినీతి వ్యతిరేక ఉద్యమకర్త అలెక్స్ నవల్నీకి మద్దతు లభించింది. పైగా మాస్కో మేయర్ పదవికి గతంలో జరిగిన ఎన్నికల్లో ఆయన మూడింట రెండువంతుల ఓట్లు సాధించగలిగారు. పుతిన్ అప్రూవల్ రేటింగ్ ఇప్పటికీ 60 శాతం పైగానే ఉన్నప్పటికీ.. ప్రజల్లో ఆయన ప్రభుత్వం పై క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోంది.