రాజకీయ నాయకులకు యువత ఓట్లు ఎంతో ముఖ్యమైనవి. అందులో భాగంగానే వారిని ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం సరికొత్త పధకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని యువతకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయాలన్న వినూత్న నిర్ణయానికి ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ పధకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టనున్నారు.
మొదటిగా ప్రభుత్వ పాఠశాలల్లో 11,12 తరగతులు చదువుతున్న ఫోన్లు లేని విద్యార్థినులకు ఈ స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయనున్నారు. ఇకపోతే ప్రభుత్వం పంపిణీ చేసే ఫోన్లలో సరికొత్త ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. రాష్ట్రంలో సాంకేతికతను మరింతగా విస్తరించడంతో పాటుగా యువతకు ఉద్యోగ, విద్య అవకాశాల గురించి సమాచారం అందిస్తామన్నారు.