AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ కోతి బొమ్మను సైకిల్‌పై ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఎలా దొరికిపోయాడంటే..?

బ్రిటన్‌లో జరిగిన ఓ వింత దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఓ గార్డెన్ సెంటర్ నుంచి భారీ ఒరంగుటాన్ బొమ్మను దొంగిలించిన వ్యక్తి దాన్ని కారులోనో, వ్యాన్‌లోనో కాకుండా ఏకంగా సైకిల్ హ్యాండిల్‌బార్లపై పెట్టుకుని తీసుకెళ్లాడు. సుమారు రెండు నెలల పాటు కనిపించకుండా పోయిన ఆ భారీ బొమ్మను పోలీసులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు.

భారీ కోతి బొమ్మను సైకిల్‌పై ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఎలా దొరికిపోయాడంటే..?
Missing Orangutan Statue
Balaraju Goud
|

Updated on: Nov 21, 2026 | 6:03 PM

Share

బ్రిటన్‌లో జరిగిన ఓ వింత దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఓ గార్డెన్ సెంటర్ నుంచి భారీ ఒరంగుటాన్ బొమ్మను దొంగిలించిన వ్యక్తి దాన్ని కారులోనో, వ్యాన్‌లోనో కాకుండా ఏకంగా సైకిల్ హ్యాండిల్‌బార్లపై పెట్టుకుని తీసుకెళ్లాడు. సుమారు రెండు నెలల పాటు కనిపించకుండా పోయిన ఆ భారీ బొమ్మను పోలీసులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. దానికి ముద్దుగా ‘బ్రూస్’ అని పేరు కూడా పెట్టారు. ఈ బొమ్మ విలువ 799 పౌండ్లు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.90 వేల వరకు ఉంటుందని అంచనా.

సైకిల్‌పై భారీ బొమ్మతో పరార్!

వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌షైర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 7న హార్నింగ్‌సీలోని స్కాట్‌డేల్స్ గార్డెన్ సెంటర్ నుంచి భారీ ఒరంగుటాన్ బొమ్మ చోరీకి గురైంది. అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన సిబ్బందికి ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఓ వ్యక్తి భారీ బొమ్మను సైకిల్ హ్యాండిల్‌బార్లపై ఆనించి తీసుకెళ్తున్నట్లు రికార్డయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

61 ఏళ్ల దొంగకు 23 నెలల జైలు శిక్ష!

ఈ కేసులో సావ్‌స్టన్‌లోని న్యూ రోడ్ ప్రాంతానికి చెందిన 61 ఏళ్ల డెరెక్ లండ్‌గ్రెన్‌ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. నవంబర్ 9న ఇప్స్‌విచ్ మేజిస్ట్రేట్స్ కోర్టులో హాజరైన అతడు షాపు దొంగతనం చేసినట్లు, గతంలో విధించిన మూడు శిక్షలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు అతడికి ఏడాది 11 నెలల జైలు శిక్ష విధించింది.

రెండు నెలల తర్వాత దొరికిన బ్రూస్!

అయితే, డెరెక్ అరెస్టుతో ఈ కథ ముగియలేదు. దొంగిలించిన ఒరంగుటాన్ బొమ్మ ఆచూకీ మాత్రం లభించలేదు. నవంబర్ 20న ఓ వ్యక్తి అందించిన సమాచారంతో పోలీసులు కేంబ్రిడ్జ్‌షైర్‌లోని టెవర్‌షామ్ ప్రాంతంలోని ఓ చిరునామాలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ చోరీకి గురైన భారీ ఒరంగుటాన్ విగ్రహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఓ మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన వస్తువు తన వద్ద ఉన్నట్లు ఆమె అంగీకరించడంతో షరతులతో కూడిన హెచ్చరిక జారీ చేసి విడుదల చేశారు.

పోలీసులు పెట్టిన పేరు ‘బ్రూస్’!

ఈ ఘటనలో అందరినీ ఆకట్టుకున్న మరో విషయం ఏమిటంటే.. పోలీసులు ఆ ఒరంగుటాన్ బొమ్మకు ‘బ్రూస్’ అని పేరు పెట్టడం. దాదాపు రెండు నెలల తర్వాత సురక్షితంగా లభించిన బ్రూస్‌ను తిరిగి స్కాట్‌డేల్స్ గార్డెన్ సెంటర్‌కు అప్పగించనున్నట్లు పోలీసులు సోషల్ మీడియాలో ప్రకటించారు. సైకిల్‌పై భారీ కోతి బొమ్మను ఎత్తుకెళ్లిన దొంగ, చివరకు జైలు పాలవడం.. పోలీసులు ఆ బొమ్మకు పేరు పెట్టి తిరిగి యజమానికి అప్పగించడం.. ఈ మొత్తం వ్యవహారం బ్రిటన్‌లో నవ్వులు పూయిస్తోంది. ఓ చిన్న దొంగతనం కాస్తా ఆసక్తికరమైన క్రైమ్ స్టోరీగా మారిపోయింది!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us