కరోనా భయం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు ప్రజలు. అన్ని వ్యవస్థలు నెమ్మదిగా తెరుచుకుంటున్నా.. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో తెరిచేందుకు దేశంలోని ఏ రాష్ట్రం కూడా సహాసం చేయడం లేదు. అయితే విద్యాసంస్థలు ప్రారంభించాలా.. వద్దా.. అనే నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మరోసారి స్పష్టం చేశారు.
దేశంలో ఇప్పటికే 17 రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయని అన్నారు. అక్కడ కనీస హాజరు విధానాన్ని పాటిస్తున్నారని వెల్లడించారు. విద్యాసంస్థల ప్రారంభం, పరీక్షలు, ఇతర అంశాలపై మంత్రి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రశ్నలకు ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా మంత్రి సమాధానాలిచ్చారు.
ఏటా సీబీఎ్‌సఈ వార్షిక పరీక్షలను మార్చి నెలలోనే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అదేమీ తప్పనిసరి కాదన్నారు. కరోనా పరిస్థితిలో మార్పు లేకపోతే పరీక్షలు వాయిదావేస్తామని అభిప్రాయ పడ్డారు. ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేసే యోచన ఉందని అన్నారు. దీంతో విద్యార్థులకు మరింత సమయం లభిస్తుందని గుర్తు చేశారు. జేఈఈ పరీక్షలు ఇంతవరకు రెండుసార్లు నిర్వహిస్తుండగా.. ఈసారి 2, 3, 4 సార్లు కూడా నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు.