
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( GHMC) పరిధిలో నాలాల అభివృద్ధికి ప్రత్యేక వ్యూహాత్మక కార్యక్రమం తీసుకురాబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో భారీ వరదలు వచ్చినా ముంపును అరికట్టేలా నాలాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. నాలాల వ్యూహాత్మక అభివృద్ధికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రత్యేక విభాగం నాలాలు, డ్రైనేజీలను అధ్యయనం చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేయనున్నారు.
పురపాలక. వైద్య ఆరోగ్య, సాగునీటిశాఖల అధికారులు పనులను పర్యవేక్షిస్తారు. నాలాలపై ఆక్రమణల తొలగింపు బాధ్యతలను కూడా ప్రత్యేక విభాగానికే అప్పగిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని చాలా నాలాలు ఆక్రమణకు గురవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు నీటమునిగిన విషయం తెలిసిందే.
దీంతో భవిష్యత్‌లో ఇలాంటి ఉపద్రవం పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నాలాలపై అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేసిన విషయం తెలిసింది.