విశాఖపట్నంలో ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య పై జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కన్న బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. యువతిపై ప్రేమోన్మాది దాడి ఆగ్రహానికి గురి చేసిందని కన్నబాబు టీవీ9తో అన్నారు. “ఘటన పట్ల సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.. బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం ప్రకటించారు” అని కన్నబాబు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు, హోంమంత్రి వెళ్ళాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారని చెప్పారు. ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులాంటి వాళ్ళన్న మంత్రి కన్నబాబు, ఘటన వెనుక ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదన్నారు. మహిళల భద్రత, నిందితులకు సత్వర శిక్ష కోసమే సీఎం దిశా యాక్ట్ ను తీసుకొచ్చారని… దీనిపై కేంద్ర క్లియరెన్స్ రావాల్సి ఉందని ఆయన అన్నారు. ఇటువంటి దాడులు చేసిన వారికి గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. వేరొకరు ఇటువంటి దాడులకు పాల్పడేముందు భయపడే పరిస్థితి రావాలని అన్నారు. ప్రేమ పేరుతో ఆడపిల్ల ప్రాణాలు తీయడమనేది సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి అని కన్నబాబు టీవీ9తో వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం ప్రతీ ఆడపిల్లకు భద్రత, భరోసా కల్పించే విధంగా పనిచేస్తుంది అని కన్నబాబు చెప్పుకొచ్చారు. విశాఖలో దారుణం: వరలక్ష్మి గొంతుకోసి చంపిన లా విద్యార్థి అఖిల్