నిర్మల్ జిల్లాలో మంత్రి, సీఎంవో కార్యదర్శి పర్యటన..
నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మామడ మండలం పొన్కల్ గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ పనులను పరిశీలించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులపై ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల స్థితిగతులపై స్వయంగా పరిశీలిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ సదర్మాట్ ప్రాజెక్టు పరిశీలినకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
బ్యారేజీ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బ్యారేజీ పనులపై ఆరా తీశారు.సదర్మాట్ బ్యారేజీ పనులు మధ్యలో నిలిచిపోవడంతో గత కొన్ని రోజులుగా ఎలాంటి పనులు సాగడం లేదు. ప్రాజెక్టు నిలిచిపోవడానికి గల కారణాలను కాంట్రాక్టర్లను తెలుసుకున్నారు. పనులు సాగే తీరును స్వయంగా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులతో చర్చించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు త్వరలోనే ప్రభుత్వం పరిహారం చెల్లించనున్నట్లుగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. పర్యటనలో ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.