Massive Theft : కృష్ణాలో భారీ చోరీ జరిగింది. పమిడిముక్కల మండలంలో గురజాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చోరీలో రూ. కోటికి పైగా విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దొంగిలించారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు చల్లా రాజేశ్వరి గత కొంత కాలంగా ఒంటరిగా ఉంటారు. చల్లా రాజేశ్వరి కుమారుడు సింగపూర్‌లో ఉంటున్నారు.
ఆమె గృహానికి తాళం వేసి మచిలీపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లి సోమవారం రాత్రి ఇంటికి తిరిగి రావడంతో ఈ చోరీ వెలుగులోకి వచ్చింది. ఇంటి ప్రధాన ద్వారం గడియ విరగ్గొట్టి, లోపల బీరువాలు తెరిచి ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు.
దీంతో సోమవారం రాత్రి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాల్లో ఉంచిన 1200 గ్రాముల బంగారు, 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులు అపహరణకు గురైనట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీ బత్తిన శ్రీనివాసులు, ఏసీపీ కె.విజయపాల్, క్రైం ఏడీసీపీ సుభాష్‌చంద్రబోస్, సీఐలు నాగవరప్రసాద్, శివాజీరాజు, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. ఆధారాల సేకరణ బృందం వారు వేలిముద్రలు సేకరించారు. ఈ చోరీలో పాల్గొన్నది ఎవరూ అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.