Viral: స్మశానంలో పూజలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్.. అతనికి ఫామ్‌హౌస్‌కి వెళ్లి తనిఖీ చేయగా..
రామనగర జిల్లా జోగనహళ్లి గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో 25 మానవ పుర్రెలు, వందల సంఖ్యలో ఎముకలు లభ్యమయ్యాయి. ఫామ్‌హౌస్‌లో పూజలు చేసేందుకు పుర్రెలు, ఎముకలు భద్రపరిచిన బలరాం అనే వ్యక్తిని బిడాది పోలీసులు అరెస్టు చేశారు. గ్రామానికి సమీపంలోని శ్మశానవాటికలో బలరాం పుర్రెలను పూజిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీవీ9 కన్నడ నివేదించింది.

కర్నాటక రాష్ట్రంలోని రామనగర జిల్లా జోగనహళ్లి గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌లో 25 మానవ పుర్రెలు, వందల సంఖ్యలో ఎముకలు లభ్యమవ్వడం కలకలం రేపింది. క్షుద్ర పూజలు చేసేందుకు బలరాం అనే వ్యక్తి పుర్రెలు సేకరించినట్లు ప్రాథమికంగా తెలిసింది. బలరాం శ్మశాన వాటికలో పూజలు చేయడం చూసిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మహా శివరాత్రి అమావాస్య ఆదివారంతో ముగిసింది. ఈ సమయంలో జోగనహళ్లి గ్రామానికి చెందిన బలరాం అనే వ్యక్తి రాత్రి శ్మశాన వాటికలో పూజలు చేస్తుండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రజల ఫిర్యాదు మేరకు బిడాది పోలీసులు శ్మశాన వాటిక వద్దకు వచ్చి బలరాంను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా బలరాం ఫామ్‌హౌస్‌లో చెక్ చేయగా.. అనేక మానవ పుర్రెలు లభ్యమయ్యాయి.
బలరాం ఫామ్ హౌస్‌లో పెద్ద ఎత్తున మానవ పుర్రెలు దొరకడంతో జనం షాక్ తిన్నారు. ఈ పుర్రెలకు పసుపు, కుంకమ అద్ది, తెల్లటి చారలు వేసి ఉన్నాయి. దీనిపై కేసు కూడా నమోదు చేసి, బిడాది పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్పీ టివి సురేష్, బిడాది ఇన్‌స్పెక్టర్ చంద్రప్ప సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం కూడా ఘటనాస్థలిని సందర్శించి క్లూస్ సేకరించింది. నిందితుడు గత 4-5 ఏళ్లుగా పుర్రె, చేతులు, కాళ్ల ఎముకలు సేకరించినట్లు అనుమానిస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో లభించిన పుర్రెలు, ఎముకల వయస్సును తెలుసుకోవడానికి ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం పరీక్షలు నిర్వహిస్తుంది. నిందితుడు బలరాం అక్కడ కూర్చోడానికి, పడుకోవడానికి మానవ శరీర ఎముకలతో కూడిన ఒక మంచాన్ని తయారు చేయడం చూసి పోలీసులు విస్మయానికి గురయ్యారు.
బలరాం ప్రస్తుతం పోలీసుల అదులో ఉన్నాడు. ఇతనికి బిడాది పారిశ్రామిక ప్రాంతంలో భూమి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భూమిని ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇచ్చాడు. ఆ పక్కనే ఉన్న కొద్దిపాటి స్థలంలో షెడ్డు నిర్మించి ఆ షెడ్డుకు ‘శ్రీ స్మశాన కలి పితా’ అని నామకరణం చేసి శ్మశాన వాటిక నుంచి పుర్రె తెచ్చి పూజలు చేస్తూ.. ఇప్పుడు పోలీసులకు పట్టుబడ్డాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




