
కరోనా ప్రపంచంలో మొత్తాన్నీ కష్టాల్లోకి నెట్టింది. లాక్ డౌన్ కారణంగా అవి మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కొన్ని హృదయ విదారక ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. నిండు గర్భిణిగా ఉన్న కూతుర్ని చూడాలనుకున్న ఆ తండ్రి ఆశలు కలగానే మిగిలిపోయాయి. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువలో గంట ఈతకొట్టి తన ప్రాణమైన కుమార్తెను చూసేస్తానని బయలు దేరిన తండ్రి..ఈదుతూనే ప్రాణాలు విడిచాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని పల్లిపాలయానికి చెందిన పెరుమాళ్(60) అనే వ్యక్తి తన కుమార్తె సుమతిని… హనూర్ మండలం పుదుర్ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణి. కాన్పు సమయం కావడం వల్ల సుమతిని శనివారం మెట్టూరు హాస్పిటల్ లో చేర్చారు. తొలి కాన్పు కావడంతో కరోనా లాక్డౌన్ ఉన్నా పెరుమాళ్ ఎలాగైనా కూతరును చూడాలని నిశ్చయించుకొన్నాడు. రెండు ఊర్ల మధ్య ఉన్న కాలువను ఈది ఆమె దగ్గరకు చేరుకోవాలని భావించాడు. తమిళనాడు-కర్ణాటక బోర్డర్స్ లో మైసూర్-మెట్టూరు హైవేకి 200 మీటర్ల సమీపంలో ఉంటుందీ కాలువ. గంటసేపు ఈత కొడితే తమిళనాడులోని కరేకాడు చేరుకోవచ్చు. కొంతదూరం బాగానే వెళ్లిన పెరుమాళ్..మధ్యలో ఆయాసంతో ఈత కొట్టలేక కాలువలో మునిగి చనిపోయాడు. తమిళనాడులోని బరగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతడి డెడ్ బాడీ దొరికింది.