
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎంపీలకు సూపర్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఢిల్లీ వెళ్ళండి.. ఉత్త చేతులతో ఊపుకుంటూ రావద్దు’’ ఇది కేటీఆర్.. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఇచ్చిన వార్నింగ్. జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీలతో కేటీఆర్ మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా, ప్రస్తావించాల్సిన అంశాలపైనా సుదీర్ఘంగా చర్చించారు.
మునిసిపల్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయం సాధించేలా పార్టీని నడిపించిన కేటీఆర్‌ను ఎంపీలంతా కలిసి అభినందించారు. ఆ తర్వాత పార్లమెంటు సమావేశాల వ్యూహంపైన చర్చించారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు, నీతి ఆయోగ్ నిధులు.. అన్నింటినీ సాధించేలా కార్యాచరణ అమలు పరచాలని కేటీఆర్ ఎంపీలను ఆదేశించారు.
విభజన హామీలను నెరవేర్చకుండా గత ఆరేళ్లుగా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. వాటి అమలు కోసం కచ్చితంగా పోరాడాలన్న కేటీఆర్ సూచన మేరకు పని చేస్తామని సమావేశం అనంతరం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు వెల్లడించారు. ఏన్ఆర్సీ, సీఏఏలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటన చేసినందున దానికి అనుగుణంగా పార్లమెంటులో వ్యవహరిస్తామని కేకే అన్నారు.
జాతీయ జనాభా గణనలో ఓబీసీ కేటగిరీని చేర్చాలని కోరతామన్నారు. ఎకానమీ తగ్గుదల, సీఏఏ లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తామని కేకే చెప్పారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని, ఈ అంశంపై మోదీ సర్కార్‌ని నిలదీస్తామని ఆయనన్నారు. బుధవారం ఢిల్లీలో జరగనున్న అఖిల పక్ష సమావేశంలో కూడా ఈ అంశాలను చేర్చాలని కోరుతామన్నారు. గత బడ్జెట్‌లో ప్రస్తావించి, నెరవేర్చని అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు లోక్‌సభలో టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర రావు.