Telangana New CM: ఫిబ్రవరి 18న ముహూర్తం! కేసీఆర్ స్థానంలో కేటీఆర్..!! మంత్రులు, ఎమ్మెల్యేల మాటల అర్థమదేనా?

|

Jan 21, 2021 | 1:22 PM

తెలంగాణాలో అతిపెద్ద రాజకీయ పరిణామానికి రంగం సిద్దమవుతోందా? చాలా కాలంగా వినిపిస్తున్న పరిణామానికి ఫిబ్రవరి నెలే ముహూర్తం కానున్నదా? దానికి సంకేతంగానే...

Telangana New CM: ఫిబ్రవరి 18న ముహూర్తం! కేసీఆర్ స్థానంలో కేటీఆర్..!! మంత్రులు, ఎమ్మెల్యేల మాటల అర్థమదేనా?
Follow us on

KTR to replace KCR as Chief Minister soon: తెలంగాణాలో అతిపెద్ద రాజకీయ పరిణామానికి రంగం సిద్దమవుతోందా? చాలా కాలంగా వినిపిస్తున్న పరిణామానికి ఫిబ్రవరి నెలే ముహూర్తం కానున్నదా? దానికి సంకేతంగానే రెండ్రోజులుగా అధికార పార్టీ నేతలు వరుసపెట్టి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారా? పరిస్థితి చూస్తుంటే.. పరిణామాలను గమనిస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు. ఎస్.. తెలంగాణలో అతిపెద్ద రాజకీయ కీలక పరిణామానికి ఫిబ్రవరి నెల సాక్షి కాబోతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది.

2014లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బొటాబొటీగా దక్కిన మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. దాని అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత 2014 జూన్ రెండవ తేదీన ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. తదనంతర క్రమంలో టీఆర్ఎస్ బలాన్ని అనూహ్యంగా పెంచేశారు గులాబీ దళపతి. అప్పటి వరకు తెలంగాణలో బలంగా కనిపించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను నామమాత్రపు పార్టీలుగా మార్చేసిన రాజకీయ చతురత కేసీఆర్ సొంతం. గులాబీ పార్టీ దూకుడు ముందు నిలువలేక టీడీపీ పార్టీ తెలంగాణలో తమ దుకాణాన్ని దాదాపు మూసి వేయగా.. కాంగ్రెస్ పార్టీ తమ ప్రజా ప్రతినిధులను కాపాడుకోలేక చతికిలా పడింది.

గులాబీ పార్టీ తాకిడికి తెలుగుదేశం పార్టీ ఎంతగా కునారిల్లి పోయిందంటే.. 2018 ఎన్నికల్లో కనీసం సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేక.. చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవాల్సి వచ్చింది. అతికష్టం మీద గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా టీడీపీ కాపాడుకోలేకపోయిందంటే కేసీఆర్ వ్యూహం ఎంతగా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిందో ఊహించుకోవచ్చు. అటు కాంగ్రెస్ కూడా తమ పార్టీ తరపున గెలిచిన 19 మందిలో 12, 13 మంది అధికార పార్టీ ఆకర్ష్‌కులోనై పార్టీకి దూరమైనా ఏమి చేయలేని పరిస్థితికి చేరింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ సత్తా చాటింది. అయితే విజయాల పరంపరకు దుబ్బాక ఉప ఎన్నిక బ్రేక్ వేసినప్పటికీ.. తెలంగాణలో ఇప్పటికీ టీఆర్ఎస్‌ను ఢీకొనే ప్రత్యర్థి పార్టీ లేదన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి పగ్గాలను గులాబీ దళపతి తన కుమారుడు, రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగిస్తారంటూ గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. దానికి తోడు.. తాను జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తానంటూ కేసీఆర్ పలు మార్లు చేసిన ప్రకటనలు కూడా ముఖ్యమంత్రి మార్పిడి ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. అయితే, ముఖ్యమంత్రి మార్పిడిపై ఎంత జోరుగా ప్రచారం జరుగుతున్నా.. అంతర్గత భేటీల్లో మాత్రమే నోరు విప్పే గులాబీ దళం గత రెండ్రోజులుగా అంటే జనవరి 19, 20 తేదీలలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ బహిరంగ ప్రకటనలు ప్రారంభించారు. వీరిలో కొందరైతే ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రి అంటూ సంబోధించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు అయితే ఏకంగా కాబోయే ముఖ్యమంత్రికి రైల్వే, అసెంబ్లీ ఉద్యోగుల తరపున శుభాకాంక్షలు కూడా తెలిపారు. అంతటితో ఆగకుండా.. ముఖ్యమంత్రి కాగానే తాను సారథ్యం వహిస్తున్న రైల్వే ఎంప్లాయిస్ సమస్యలను పరిష్కరించాలంటూ కేటీఆర్‌కు విఙ్ఞప్తి కూడా చేసేశారు.

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నట్లు ప్రకటనలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఓ అడుగు ముందుకేసి.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ప్రశ్నించారు. మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కరుణాకర్, శ్రీనివాస్ గౌడ్ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటనలు మొదలు పెట్టారు.

ఇదిలా వుంటే.. కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే తేదీపై కూడా ప్రచారం జోరందుకుంది. ఫిబ్రవరి 18వ తేదీన కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనిని అధికార పార్టీ నేతలు కూడా ఖండించడం లేదంటూ ఈ తేదీ దాదాపు ఖరారైనట్లేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంకోవైపు వివిధ దేశాలలో వున్న కేటీఆర్ స్నేహితులు, అనుచరులు, అభిమానులు ఫిబ్రవరి 18వ తేదీనాటికి హైదరాబాద్‌లో వుండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి ముహూర్తానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టడం ఖాయమని చెప్పుకుంటున్నారు. అయితే జరుగుతున్న ప్రచారం కేసీఆర్ వ్యూహంలో భాగమా? లేక నిజంగానే ముఖ్యమంత్రి పీఠం తనయునికి అప్పగిస్తున్నారా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.