నిబంధనలు ఉల్లంఘన.. విజయవాడలో మరో ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు.!

|

Sep 13, 2020 | 12:38 PM

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ,  లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న మరో ప్రైవేట్ ఆసుపత్రిపై వేటు పడింది.

నిబంధనలు ఉల్లంఘన.. విజయవాడలో మరో ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు.!
Follow us on

Covid Center In Liberty Hospital: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ,  లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న మరో ప్రైవేట్ ఆసుపత్రిపై వేటు పడింది. కృష్ణా జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కోవిడ్ వైద్యాన్ని కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన కలెక్టర్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

విజయవాడలోని లిబర్టీ హాస్పిటల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని రాజమండ్రికి చెందిన ఓ మహిళ కలెక్టర్ ఇంతియాజ్‌కు ఫిర్యాదు చేసింది. లక్షల రూపాయలు వసూలు చేసి తన భర్త ప్రాణాలు పోగొట్టారని ఆరోపించింది. ఇక బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ చేపట్టి.. లిబర్టీ హాస్పిటల్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా ఆటోనగర్‌లోని లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్ పేషేంట్లకు చికిత్సను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. కాగా, ప్రస్తుతం ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను వేరే చోటుకి తరలించాలని డీఎంహెచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు.