తెలంగాణాలో ‘ కమల వికాసం ‘.. మురళికి అధ్యక్ష పగ్గాలు ?

|

Jul 31, 2019 | 1:07 PM

పొరుగున ఉన్న కర్ణాటకలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడంతో అది తెలంగాణాలో ప్రభావం చూపనుందా ? కర్ణాటక రాజకీయ నీడలు పరోక్షంగా ఇక్కడా పరచుకోనున్నాయా ? లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకోవడంతో.. మెల్లగా ‘ కమల వికాసానికి ‘ దారులు సుగమం అవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర రావు ఆ రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ సంక్షోభంలో తిరిగి పార్టీ […]

తెలంగాణాలో  కమల వికాసం .. మురళికి అధ్యక్ష పగ్గాలు ?
Follow us on

పొరుగున ఉన్న కర్ణాటకలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడంతో అది తెలంగాణాలో ప్రభావం చూపనుందా ? కర్ణాటక రాజకీయ నీడలు పరోక్షంగా ఇక్కడా పరచుకోనున్నాయా ? లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకోవడంతో.. మెల్లగా ‘ కమల వికాసానికి ‘ దారులు సుగమం అవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర రావు ఆ రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ సంక్షోభంలో తిరిగి పార్టీ అధికారంలోకి రావడానికి, ఎడియూరప్ప మళ్ళీ సీఎం కావడానికి తన వంతు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో… తెలంగాణాలో ఆయనను బీజేపీ అధిష్టానం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. పైగా ప్రస్తుత అధ్యక్షుడు డా,కె. లక్ష్మణ్ పదవీకాలం కూడా పూర్తి కావస్తోంది. ఇదే అదనుగా ఇక్కడి పార్టీ నేతలు ఈ పోస్ట్ కోసం తమ అభ్యర్థిత్వాలను పార్టీ హైకమాండ్ ముందు ఉంచేందుకు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు.

తనను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయవచ్చునని వస్తున్న వార్తలపై స్పందించిన మురళీధరరావు.. ప్రస్తుతానికి ఇక్కడ ఆ పదవి ఖాళీ లేదన్నారు. కర్ణాటకలో ‘ బీజేపీ విక్టరీ ‘ తరువాత జాతీయ స్థాయిలో తాను పార్టీ వ్యవహారాలలో మరింత ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయని, పైగా మరికొన్ని నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఆయన చెప్పారు. అయితే ఇదే సమయంలో తెలంగాణను కూడా ఆయన విస్మరించలేదు. ఇక్కడ పార్టీని ముందుండి నడిపే అవకాశాలు కూడా ఉన్నాయని సూచనప్రాయంగా తెలిపారు. మొదట ఇక్కడ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కుప్ప కూలినట్టే టీఆర్ఎస్ కూడా కూలడం ఖాయమన్న నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను మురళీధరరావు గుర్తు చేశారు. ‘ నేను తెలంగాణకు చెందినవాడినని ప్రజలకు తెలుసు.. అయితే పార్టీ నేతలు, కార్యకర్తల గురించి ప్రజా వేదికలపై నేను మాట్లాడదలచుకోలేదు ‘ అని ఆయన అన్నారు.

కాగా-తెలంగాణ నూతన బీజేపీ అధ్యక్ష పదవికి వినిపిస్తున్న పేర్లలో పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్. రామచందర్ రావు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పి. సుధాకర రెడ్డి ఉన్నారు.