చల్లబడిన మంగుళూరు.. అయినా వీడని ఉద్రిక్తత

| Edited By: Anil kumar poka

Dec 24, 2019 | 4:10 PM

ఎన్నార్సీ, సీఏఏలను వ్యతిరేకిస్తూ కర్నాటకలోని మంగుళూరులో ఈ నెల 22 న జరిగిన హింసాత్మక ఆందోళనల్లో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ నగరంలో 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ.. పెద్ద సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఓ ఆటో ట్రాలీలో రాళ్లను తీసుకొచ్చిన ఆందోళనకారులు వాటిని పోలీసులపైకి విసరడం, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడానికి యత్నించడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. పోలీసులు ఈ వీడియోను విడుదల చేశారు. నిరసనకారుల్లో కొందరు […]

చల్లబడిన మంగుళూరు.. అయినా వీడని ఉద్రిక్తత
Follow us on

ఎన్నార్సీ, సీఏఏలను వ్యతిరేకిస్తూ కర్నాటకలోని మంగుళూరులో ఈ నెల 22 న జరిగిన హింసాత్మక ఆందోళనల్లో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ నగరంలో 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ.. పెద్ద సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి.. పోలీసులపై రాళ్లు రువ్వారు.

ఓ ఆటో ట్రాలీలో రాళ్లను తీసుకొచ్చిన ఆందోళనకారులు వాటిని పోలీసులపైకి విసరడం, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడానికి యత్నించడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. పోలీసులు ఈ వీడియోను విడుదల చేశారు. నిరసనకారుల్లో కొందరు తమ ముఖాలు కనిపించకుండా జేబు రుమాళ్ళను కప్పుకుని రాళ్లు విసురుతున్న దృశ్యాలతో బాటు ఒక పొడవాటి వెదురుకర్రతో ఒకరు సీసీటీవీ కెమెరాను పగులగొట్టే క్లిప్ కూడా ఒకటుంది. ఈ ఆందోళనకారులను గుర్తించేందుకు తాము వీరి ఫోటోలను, వీడియోలను రిలీజ్ చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు..

కాగా-  వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్ లో గాయపడినవారు దగ్గరలోని ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటుండగా.. ఖాకీలు ఆయా ఆసుపత్రులలోనూ చొరబడి.. బీభత్సం సృష్టించారు. కొందరు ఏకంగా ఐసీయులలోకే ప్రవేశించి రోగులన్న కనికరం కూడా లేకుండా దాదాపు లాఠీచార్జి చేసినంత పని చేశారు. దీంతో కొన్నివార్డులు, ఐసీయులలో దాక్కున్న నిరసనకారులతో బాటు కొంతమంది రోగులు కూడా బయటకు పరుగులు తీశారని తెలుస్తోంది. పోలీసుల చర్యకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళనకారులు పలు చోట్ల వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు. సీఎం ఎదియూరప్ప మంగుళూరును సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు. కాగా-నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్న వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ నగరం ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ.ఉద్రిక్తంగానే ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు హడలిపోతున్నారు. మొత్తం సిటీ అంతటా పోలీసులు మోహరించారు.