Jet Airways 2.0: 2021 వేసవినాటికి జెట్ ఎయిర్‌వేస్ 2.0 విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో స్లాట్ల కేటాయింపు, ద్వైపాక్షిక ట్రాఫిక్ హక్కులు లాంటి విషయాలపై చర్చలు సాగుతున్నాయట. విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ గతేడాది ఏప్రిల్‌లో బంద్ అయిన విషయం తెలిసిందే. మళ్లీ ప్రారంభించడానికి ఆ సంస్థ యాజమాన్యం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులంతా రోడ్డునపడ్డారు.
మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన జెట్ ఎయిర్‌వేస్ రూ.9వేల కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కాగా జెట్ ఎయిర్‌వేస్‌కు అప్పులిచ్చిన రుణదాతల కమిటీ మొత్తం మళ్లీ ఈ ఎయిర్‌లైన్ పునరుద్ధరణ ప్లాన్‌ను సహకరిస్తోంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కూటమికే ఈ సంస్థలో మెజారిటీ వాటా ఉంది. ఈసారి మునపటి తప్పులు చేయకుండా ఉండాలని నిర్ణయించుకుంది జెట్ ఎయిర్ వేస్. తమ సేవలను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలని చూస్తోంది. అలాగే గూడ్స్ ను రవాణా చేసే సర్వీసులనూ మొదలుపెట్టాలని భావిస్తోంది.