లొంగుబాటు వార్తలు బూటకం.. టీవీ9తో జంపన్న

|

Sep 02, 2020 | 7:43 PM

అగ్రనేతల లొంగుబాటు ప్రచారంపై టీవీ 9 తో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న మాట్లాడారు. అగ్రనేతలు గణపతి, కటకం సుదర్శన్‌, మల్లోజుల వేణుగోపాల్‌, రాజిరెడ్డి లొంగుబాటు వార్తలపై ఆయన స్పందించారు.

లొంగుబాటు వార్తలు బూటకం.. టీవీ9తో జంపన్న
Follow us on

అగ్రనేతల లొంగుబాటు ప్రచారంపై టీవీ 9 తో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న మాట్లాడారు. అగ్రనేతలు గణపతి, కటకం సుదర్శన్‌, మల్లోజుల వేణుగోపాల్‌, రాజిరెడ్డి లొంగుబాటు వార్తలపై ఆయన స్పందించారు. ఒకేసారి ఇంతమంది కేంద్ర కమిటీసభ్యుల లొంగుబాటు జరగదు అని అన్నారు. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు ప్రచారం పచ్చి అబద్ధం అని కొట్టిపడేశారు. మీడియా ద్వారానో, పత్రికల ద్వారానో లొంగుబాటనేది జరగదని స్పష్టం చేశారు.

43 ఏళ్ల పాటు పార్టీని మోసిన వ్యక్తి.. ఇలా ప్రచారంచేస్తూ బయటికి రాడని అభిప్రాయపడ్డారు. గణపతి, వేణుగోపాల్‌, కటకం సుదర్శన్ తో తాను 20 ఏళ్లు పనిచేశాను అని అన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. వారికి అనారోగ్య సమస్యలున్నమాట వాస్తవం అని ఒప్పుకున్నారు.

అయితే ఆ ఒక్క కారణంతో ఏ మావోయిస్టు లొంగిపోడని తెలిపారు. గణపతి లాంటి నేత మీరీ (మోసుకుని తిరిగే స్థితిలో) అలాంటి పరిస్థితుల్లో లేడు అని చెప్పారు. ఎవరైనా లొంగిపోవాలంటే మావోయిస్టు పార్టీనే సహకరిస్తుందని పేర్కొన్నారు. నేను లొంగిపోతానంటే సహకరించింది కూడా మావోయిస్టు పార్టీనే అని గుర్తు చేశారు. అనారోగ్యంతో ఉంటే పార్టీనే వారిని కాపాడుకుంటుందని వెల్లడించారు.

లొంగుబాటు వ్యక్తి ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. కమిటెడ్‌ మావోయిస్టుల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. వారు ఉద్యమకోసమే పనిచేస్తున్న వ్యక్తులు అంటూ వెల్లడించారు. గణపతి స్వచ్ఛందంగానే మావోయిస్టు సెక్రెటరీ పదవినుంచి తప్పుకున్నారని అన్నారు. 2017లోనే నంబాల కేశవరావు గణపతి స్థానంలో బాధ్యతలు తీసుకున్నారని అన్నారు.

పార్టీలో ఆంధ్ర, తెలంగాణ విభేదాలనేవి బయటి వ్యక్తుల సృష్టే విషయాలు అని… పార్టీ జెండా పట్టినప్పుడే కులం, ప్రాంతం అన్నీ వదిలేసుకుంటారని అభిప్రాయ పడ్డారు. గణపతి, వేణుగోపాల్‌, ఆజాద్‌ మావోయిస్టు పార్టీ జెండా మోసినవారు.. ఈ ఐదుగురు అగ్రనేతలు బయటికి రావడం అసంభవం… ఒకవేళ అదే జరిగితే పార్టీకి తీరని నష్టమే అని అన్నారు. లొంగుబాటు వార్తలపై కేంద్ర మావోయిస్టు పార్టీ అతి త్వరలోనే స్పందిస్తదని అన్నారు.