ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న ఓ జంటను..ఇంటిలిజెన్స్ సమాచారంతో ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైరుతి ఢిల్లీలో నివశిస్తోన్న జహన్జీవ్ సమీ, హీనా బషీర్ బేగ్ అనే జంట.. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు యువతను ప్రేరిపించడంతో పాటు, ఉగ్రవాదం దిశగా వారిని ఆకర్షిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం వారిని సీక్రెట్ ప్లేసులో విచారిస్తున్నారు. అప్ఘానిస్థాన్‌లో ఖొరాసాన్ ప్రావిన్స్‌కు చెందిన ఇస్లామిక్ టెర్రిస్టులతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
వారి నుంచి ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తి సమాచారాన్ని రాబడుతున్నారు. ఈ జంట ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జామియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలోనే వీరిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఈ కపుల్.. ఇండియన్ ముస్లిమ్స్ యునైట్ పేరిట ఓ సామాజిక మాధ్యమ వేదికను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.